LOADING...
Andhra News: ఉమ్మడి 'అనంత' జిల్లాలో విమాన తయారీ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నం.. భూములు కేటాయించేందుకు సంసిద్ధత
భూములు కేటాయించేందుకు సంసిద్ధత

Andhra News: ఉమ్మడి 'అనంత' జిల్లాలో విమాన తయారీ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నం.. భూములు కేటాయించేందుకు సంసిద్ధత

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 28, 2026
08:22 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీలో విమానాల తయారీ పరిశ్రమను స్థాపించేందుకు ప్రభుత్వం సీరియస్‌గా ప్రయత్నాలు చేపడుతోంది. ఈ కీలక ప్రాజెక్టును ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయాలనే దిశగా యోచన జరుగుతోంది. బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎంబ్రాయెర్తో అదానీ ఏరోస్పేస్ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందం మేరకు దేశంలో విమానాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎంబ్రాయెర్‌ భావిస్తోంది. వ్యాపార అవసరాలు, వాణిజ్య ప్రయాణాలు, సైనిక వినియోగానికి సంబంధించిన విమానాలు, అలాగే విమానాల విడిభాగాల తయారీలో ఎంబ్రాయెర్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది.

వివరాలు 

పోటీలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్‌ రాష్ట్రం

భారత్‌లో చిన్న, మధ్యస్థాయి ప్రయాణికుల విమానాల తయారీ యూనిట్‌ను ఈ సంస్థ ఏర్పాటు చేసే అవకాశముందని సమాచారం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్‌ రాష్ట్రం కూడా పోటీలో ఉంది. అయితే ఏపీలో ప్రధాన విమానాల తయారీ కేంద్రం లేదా దానికి అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పరిశ్రమ స్థాపనకు అవసరమైన భూములు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సానుకూలంగా స్పందించింది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా. వచ్చే నెలలో ఈ అంశంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.

వివరాలు 

అనంతపురానికే ఎందుకు?

అనంతపురం జిల్లాలో విస్తారమైన భూములు అందుబాటులో ఉండటం, అలాగే బెంగళూరుకు సమీపంగా ఉండటం ప్రధాన అనుకూలాంశాలుగా మారాయి. ఈ ప్రాంతాన్ని విమానాల తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే క్రమంలో బెంగళూరుకు చెందిన సరళ ఏవియేషన్స్ సంస్థకు ఎలక్ట్రికల్‌ వర్టికల్‌ టేకాఫ్‌, ల్యాండింగ్‌ విమానాల తయారీ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. ఈ సంస్థ రూ.1,300 కోట్ల పెట్టుబడితో ఆరు సీట్ల విమానాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. 500 ఎకరాల విస్తీర్ణంలో 'స్కై ఫ్యాక్టరీ'ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2029 నాటికి ఎయిర్‌ ట్యాక్సీలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

వివరాలు 

లేపాక్షి భూములు పరిశీలనలో

ఇదే ప్రాంతంలో ఇంకా ఖాళీగా ఉన్న భూములను విమానాల తయారీ కేంద్రానికి కేటాయించేలా ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా కొడికొండ చెక్‌పోస్టు సమీపంలో ఉన్న లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌కు కేటాయించిన 8,844 ఎకరాల భూములతో పాటు మొత్తం 20 వేల ఎకరాల్లో భారీ పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకోసం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పరిధిలో ఉన్న భూములను తిరిగి పొందేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు సమాచారం.

Advertisement

వివరాలు 

లేపాక్షి భూములు పరిశీలనలో

ఇదే సమయంలో చుట్టుపక్కల మండలాల్లో భూసేకరణ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు. ఆ భూముల్లో విమానాల తయారీ ప్రాజెక్టుకు అవసరమైన స్థలాన్ని కేటాయించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రాంతం జాతీయ రహదారికి, అలాగే బెంగళూరు దేవనహళ్లి అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉండటం మరో ప్లస్‌ పాయింట్‌గా అధికారులు పేర్కొంటున్నారు. కంపెనీ ప్రతినిధుల బృందం సూచనలకు అనుగుణంగా భూముల కేటాయింపు జరుగుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement