అమెరికా ఆపిల్స్‌పై సుంకాన్ని తగ్గించండపై ప్రియాంక గాంధీ విమర్శలు.. కేంద్రం వివరణ
అమెరికా ఆపిల్స్, వాల్‌నట్‌లు, బాదంపప్పులపై అదనపు సుంకాలు ఎత్తివేతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నిర్ణయం దేశీయ ఆపిల్, వాల్‌నట్, బాదం ఉత్పత్తిదారులపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపదని పేర్కొంది. ఆయా దిగుమతులపై 20శాతం సుంకం మాత్రమే ఎత్తివేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది. అమెరికా ఆపిల్స్‌పై 50శాతం, వాల్‌నట్‌లపై 100 శాతం సుంకం అలాగే ఉంటుందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతకుముందు అమెరికా ఆపిల్స్‌పై సుంకాలను తగ్గించడంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కేంద్రంపై తీవ్రమైన విమర్శలు చేశారు. అమెరికా ఆపిల్‌పై అదనపు దిగుమతి సుంకాలను కేంద్రం తగ్గించిందని, తద్వారా దేశంలోని ఆపిల్ రైతులకు కాకుండా అమెరికాలోని ఆపిల్ పెంపకందారులకు ప్రభుత్వం సహాయం చేస్తోందని ప్రియాంక గాంధీ విమర్శించారు.
హిమాచల్ ప్రదేశ్ రైతులకు సాయం చేస్తారా? అమెరికా రైతులకా?
హిమాచల్ ప్రదేశ్‌లో వరదల కారణంగా సంభవించిన నష్టాన్ని పరిశీలించడానికి ప్రియాంక గాంధీ వెళ్లారు. అక్కడ ఆమె మీడియాతో మాట్లాడారు. అమెరికా నుంచి వచ్చే ఆపిల్స్‌పై కేంద్ర ప్రభుత్వం సుంకం తగ్గించడం అనేది రాష్ట్రంలోని రైతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు. దీని వల్ల అమెరికన్ ఆపిల్స్ దిగుమతి సులభతరం అవుతుందని, సులభంగా అమ్ముడవుతాయని చెప్పారు. సిమ్లాలో ఆపిల్స్ సేకరణ ధరలను బడా పారిశ్రామికవేత్తలు తగ్గించారని, ఇక్కడి రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి సాయం చేస్తారా? అమెరికా రైతులకు సాయం చేస్తారా? అని ప్రియాంక ప్రశ్నించారు.
అమెరికా-భారత్ పరస్పర ఒప్పందం వల్లే అదనపు సుంకాలు ఎత్తివేత: కేంద్రం
అదనపు సుంకాల తొలగింపు వల్ల ఆపిల్స్, వాల్‌నట్‌లు, బాదంపప్పుల దేశీయ ఉత్పత్తిదారులకు ఎలాంటి నష్టం కలిగించదని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. పైగా దీని వల్ల ప్రీమియం మార్కెట్ విభాగంలో నాణ్యమైన దేశీయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ లభిస్తుందని మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారమే అదనపు సుంకాలను ఎత్తివేసినట్లు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అమెరికా ప్రభుత్వం కూడా భారతీయ ఉత్పత్తులపై విధించిన అదనపు సుంకాలను తొలగించారని, బదులుగా భారత్ కూడా అదే పని చేసినట్లు గోయల్ చెప్పారు.