DMK: అమిత్ షా వ్యాఖ్యలు సిగ్గుచేటు.. డీఎంకే కీలక తీర్మానం ఆమోదం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో డిసెంబర్ 17న చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమి పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని, కేబినెట్ నుంచి ఆయనను తప్పించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. అయితే కాంగ్రెస్ ఆరోపణలను అమిత్ షా ఖండిస్తూ, తన వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపారు. ఇప్పుడు ప్రతిపక్షాలు 'అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్' అని చెప్పడం ఫ్యాషన్ అయిపోయిందని, ఇంతలా దేవుడు పేరు తలుచుకుంటే వారికి స్వర్గంలో చోటు లభించి ఉండేదని అమిత్ షా పేర్కొన్నారు.
బీజేపీ తీరుపై డీఎంకే ఆగ్రహం
ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగిన డీఎంకే కార్యవర్గ సమావేశంలో 12 తీర్మానాలు ఆమోదించారు. వాటిలో తొలి తీర్మానంగా అమిత్ షా వ్యాఖ్యల్ని ఖండించారు. ప్రజాస్వామ్య దేవాలయంలో హోంమంత్రి ఇంత అవమానకరంగా మాట్లాడడం సిగ్గుచేటు అని, ఈ వ్యాఖ్యలపై బీజేపీ ప్రదర్శించిన డ్రామా హాస్యాస్పదంగా ఉందని డీఎంకే తన తీర్మానంలో పేర్కొంది. అమిత్ షా వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం నిందలు వేసుకుంటున్నాయి. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా స్పందించారు. అంబేద్కర్‌ను అవమానపరిచిన చరిత్ర కాంగ్రెస్‌దేనని, హోంమంత్రి అంబేద్కర్ గొప్పతనాన్ని ప్రస్తావించారని మోదీ సమర్థించారు.