LOADING...
Andhra Pradesh: నాలుగు కొత్త పర్యాటక ప్రాజెక్టులకు పచ్చజెండా.. పర్యాటకశాఖకు ప్రభుత్వం ఆదేశం
పర్యాటకశాఖకు ప్రభుత్వం ఆదేశం

Andhra Pradesh: నాలుగు కొత్త పర్యాటక ప్రాజెక్టులకు పచ్చజెండా.. పర్యాటకశాఖకు ప్రభుత్వం ఆదేశం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 13, 2026
11:41 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ ప్రభుత్వం పర్యాటక రంగానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ, ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ముందుకొచ్చే సంస్థలకు భూములను లీజుకు కేటాయించడమే కాకుండా, పర్యాటక విధానం కింద వివిధ రకాల ప్రోత్సాహకాలు, రాయితీలు కల్పిస్తోంది. ఈ క్రమంలో బాపట్ల జిల్లా సూర్యలంకలో మూడు రిసార్టుల ఏర్పాటు, అలాగే శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మెగా ఆధ్యాత్మిక-సాంస్కృతిక పర్యాటక కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చిన సంస్థలకు భూముల లీజు కేటాయింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో పర్యాటక విధానం ప్రకారం అవసరమైన ప్రోత్సాహకాలు, రాయితీలు అందించాలని రాష్ట్ర పర్యాటక శాఖను ఆదేశిస్తూ సోమవారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది.

వివరాలు 

కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్‌ 

బాపట్ల జిల్లా సూర్యలంకలో రూ.187.58 కోట్ల వ్యయంతో ఫైవ్‌స్టార్‌ కోస్టల్‌ రిసార్ట్,వెల్‌నెస్‌ సెంటర్,ఐటీసీ బ్రాండ్‌తో ఎంటర్‌టైన్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్న ఆర్న కోస్టల్‌ రిసార్ట్స్‌ సంస్థకు పర్యాటక విధానం ప్రకారం రాయితీలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 250మందికి ఉపాధి లభించనుందని రాష్ట్ర పర్యాటక శాఖ వెల్లడించింది. అలాగే సూర్యలంకలోనే రూ.64.44 కోట్లతో రాయల్‌ ఆర్చిడ్‌ బ్రాండ్‌తో త్రీస్టార్‌ 'సూర్య నమస్కార్‌' రిసార్ట్‌ అభివృద్ధికి ముందుకొచ్చిన శుభం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టు,ఇంద్రనీర్‌ ఫుడ్ అండ్ బెవరేజెస్‌ సంస్థలకు 66 ఏళ్ల లీజు కాలానికి 2.6 ఎకరాల భూమిని కేటాయిస్తూ,అవసరమైన ప్రోత్సాహకాలు మంజూరు చేయాలని ప్రభుత్వం పర్యాటక శాఖను ఆదేశించింది. ఈ ప్రాజెక్టు అమలుతో సుమారు 100మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి.

వివరాలు 

కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్‌ 

ఇక సూర్యలంకలో రూ.183.87 కోట్ల పెట్టుబడితో 'హిల్‌టన్‌' బ్రాండ్‌తో ఫైవ్‌స్టార్‌ రిసార్ట్‌తో పాటు సెయిలింగ్‌ క్లబ్, కన్వెన్షన్‌ సెంటర్‌ అభివృద్ధికి ముందుకొచ్చిన సైవెన్‌ హాస్పిటాలిటీ గ్రూప్, యూనిఫై సొల్యూషన్స్‌ కన్సార్షియంకు 6.69 ఎకరాల భూమిని 66 ఏళ్ల లీజుకు కేటాయించడంతో పాటు రాయితీలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు ద్వారా 196 మందికి ఉపాధి లభించనుంది.

Advertisement

వివరాలు 

పెనుకొండలో మెగా ఆధ్యాత్మిక కేంద్రం 

సత్యసాయి జిల్లా పెనుకొండలో గణగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పాదాల చెంత రూ.425.20 కోట్ల అంచనా వ్యయంతో మెగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటక కేంద్రం-బేస్‌ క్యాంప్‌ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన బెంగళూరుకు చెందిన కృష్ణ కాన్షియస్‌నెస్‌ అంతర్జాతీయ సంస్థ (ఇస్కాన్‌)కు పెనుకొండలో మూడు సర్వే నంబర్లలో విస్తరించి ఉన్న 119.50 ఎకరాల భూమిని లీజుకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన పలు రాయితీలు ఇవ్వాలని కూడా పర్యాటక శాఖను ఆదేశించింది. ఈ భారీ ప్రాజెక్టు అమలుతో దాదాపు 1,035 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని ప్రభుత్వం పేర్కొంది.

Advertisement