LOADING...
Andhra Pradesh: ఎల్‌నినో ప్రభావం.. ఖరీఫ్‌లో వరికి బదులుగా పప్పు,నూనెగింజల పంటలపై ఫోకస్
ఎల్‌నినో ప్రభావం.. ఖరీఫ్‌లో వరికి బదులుగా పప్పు,నూనెగింజల పంటలపై ఫోకస్

Andhra Pradesh: ఎల్‌నినో ప్రభావం.. ఖరీఫ్‌లో వరికి బదులుగా పప్పు,నూనెగింజల పంటలపై ఫోకస్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2026
08:35 am

ఈ వార్తాకథనం ఏంటి

జూన్‌ నెల ప్రారంభం కావడంతో ఖరీఫ్‌ సీజన్‌కు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం కారణంగా సెప్టెంబరు, అక్టోబరు వరకు వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో సాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఖరీఫ్‌ సాగుపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఎక్కువ నీటి అవసరం ఉండే పంటల సాగును తగ్గించి, తక్కువ నీటితో సాగు చేయగల పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. తక్కువ కాల వ్యవధిలో పూర్తయ్యే, తక్కువ పెట్టుబడి అవసరమయ్యే పంటల సాగును రైతులు చేపట్టేలా ప్రోత్సహించనుంది.

వివరాలు 

15 జిల్లాల్లో మొత్తం 86 వేల ఎకరాలు 

వరి సాగుకు అధిక నీరు అవసరమవుతుండటంతో బోర్ల కింద వరి సాగు చేస్తున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యామ్నాయంగా పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు పండించేలా చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలోని 15 జిల్లాల్లో మొత్తం 86 వేల ఎకరాలను ఇందుకోసం గుర్తించారు. వీటిలో నంద్యాల జిల్లాలో 34 వేల ఎకరాలు, తూర్పుగోదావరి జిల్లాలో 31,335 ఎకరాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా మినుము సాగుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అలాగే కాలువల పరిధిలో వరి సాగు జరిగే 11 జిల్లాల్లో 1.54 లక్షల ఎకరాల్లో పప్పుధాన్యాలు, నూనెగింజల పంటల సాగును ప్రోత్సహించనున్నారు. నంద్యాల జిల్లాలో 54,655 ఎకరాలు, పల్నాడు జిల్లాలో 26 వేల ఎకరాలు, ఏలూరు జిల్లాలో 26,600 ఎకరాలు ఈ ప్రణాళికలో భాగంగా ఉన్నాయి.

వివరాలు 

రాయితీపై విత్తనాల పంపిణీ

ఇక రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో రైతులను పొగాకు సాగు నుంచి పప్పుధాన్యాలు, నూనెగింజల పంటల వైపు మళ్లించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. సుమారు 15,375 ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులకు ప్రోత్సాహకాలు అందించనుంది. వరి కోతల అనంతరం సాగు చేపట్టేందుకు,అలాగే చేలగట్లపై పంటలు పండించేందుకు 59,840 ఎకరాల విస్తీర్ణానికి అవసరమైన విత్తన కిట్లను 100 శాతం రాయితీపై పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా సుమారు లక్ష ఎకరాల సాగుకు అవసరమైన కంది, మినుము, శనగ విత్తనాలను 50 శాతం రాయితీపై రైతులకు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. పల్స్‌ మిషన్‌ ద్వారా రైతులు పండించే కందులు, మినుములను పూర్తిస్థాయిలో సేకరిస్తామని వ్యవసాయ శాఖ రైతులకు అవగాహన కల్పిస్తోంది.

Advertisement

వివరాలు 

ప్రత్యామ్నాయ ప్రణాళికలకు సిద్ధంగా ఉండాలి: కేంద్రం

దీంతో పప్పుధాన్యాల సాగుపై రైతుల్లో మరింత ఆసక్తి పెంచాలని భావిస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాకాలం దెబ్బతినే అవకాశాల నేపథ్యంలో జిల్లాస్థాయి అత్యవసర ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సిద్ధం చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ ఆదేశించింది. ఢిల్లీలోని కృషి భవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఈ సూచనలు చేశారు. రైతులకు సకాలంలో వ్యవసాయ సలహాలు అందించాలని,కరవును తట్టుకునే స్వల్పకాలిక పంటల ధ్రువీకృత విత్తనాలను అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. జల సంరక్షణ చర్యలు చేపట్టడంతో పాటు రిజర్వాయర్లలోని నీటిని అత్యంత జాగ్రత్తగా వినియోగించాలని తెలిపారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అత్యవసర ప్రణాళికలను అమలు చేయాలని, అవి కేవలం కాగితాలకే పరిమితం కాకూడదని స్పష్టం చేశారు.

Advertisement

వివరాలు 

100 శాతం రాయితీపై నూనెగింజల విత్తనాలు

పంటల మళ్లింపు కార్యక్రమంలో భాగంగా నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్‌ అండ్‌ ఆయిల్‌సీడ్స్‌ పథకం కింద 74,875 ఎకరాల్లో నూనెగింజల పంటల సాగుకు ప్రోత్సాహం అందించనున్నారు. విలువ ఆధారిత క్లస్టర్ల పరిధిలో ఈ సాగుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు.దీని కింద 59,375 ఎకరాల్లో వేరుశనగ, 2,500 ఎకరాల్లో సోయాబీన్‌, 2,500 ఎకరాల్లో ఆముదం, 7,500 ఎకరాల్లో నువ్వుల సాగును ప్రోత్సహించనున్నారు. ఈ పంటలకు అవసరమైన విత్తనాలను 100 శాతం రాయితీపై రైతులకు అందించనున్నారు. రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాల (కేవీకే) ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. క్లస్టర్ల పరిధిలో లేని ప్రాంతాల్లో రైతు క్షేత్ర పాఠశాలల ద్వారా సాగు పద్ధతులపై శిక్షణ అందించేందుకు చర్యలు చేపట్టనున్నారు.

Advertisement