Andhra Pradesh: జులై 1 నుంచి వీబీ జీరామ్‌జీ అమలు.. ఏపీకి కేంద్రం రూ.7,707 కోట్ల మంజూరు
ఈ వార్తాకథనం ఏంటి
జులై 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి రానున్న వీబీ జీరామ్‌జీ (వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, ఆజీవిక మిషన్-గ్రామీణ్)పథకానికి రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన వాటాను కేంద్రం ఖరారు చేసింది. ఈ పథకం అమలుకు రాష్ట్ర వాటాగా రూ.5,138.14 కోట్లు సమకూర్చాల్సి ఉండగా,కేంద్ర ప్రభుత్వం తన 60శాతం వాటాగా రూ.7,707.21కోట్లు కేటాయించింది. పథకం మార్గదర్శకాల ప్రకారం మిగిలిన 40శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సి ఉండటంతో దీనికి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల కోసం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వీబీ జీరామ్‌జీ కింద మొత్తం రూ.95,692 కోట్లను కేటాయించింది. ఈ కేటాయింపుల్లో ఉత్తర్‌ప్రదేశ్ రూ.9,721కోట్లతో తొలి స్థానంలో నిలవగా,రూ.8,508కోట్లతో పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో ఉంది.
వివరాలు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి వర్చువల్ సమావేశం
రూ.7,707 కోట్ల కేటాయింపుతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా నిధులను కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో వీబీ జీరామ్‌జీ పథకం కింద మొత్తం రూ.12,845.35 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో శ్రామికులకు ఉపాధి పనిదినాలు కల్పించేందుకు రూ.7,071 కోట్లు, మెటీరియల్ కాంపోనెంట్‌కు రూ.4,714 కోట్లు, పరిపాలనతో పాటు సోషల్ ఆడిట్ కార్యక్రమాలకు రూ.1,060 కోట్లు వినియోగించనున్నారు. కేంద్రం నిధుల కేటాయింపులు ప్రకటించిన అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వాటా నిధుల సమీకరణ, పథకం అమలుకు అవసరమైన వ్యయం, నిధుల వినియోగం తదితర అంశాలపై అధికారులు ఆయనకు వివరించారు.
వివరాలు
పనిదినాలపై త్వరలో నిర్ణయం
కొత్త పథకం కింద జులై 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు శ్రామికులకు ఎన్ని పనిదినాలు కల్పించాలనే అంశంపై ఇంకా తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. రాష్ట్రాలకు కేటాయించే పనిదినాల సంఖ్య ఈ ఏడాదికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించే కనీస వేతనాలపై ఆధారపడి ఉంటుంది. కనీస వేతనాలపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఢిల్లీలో వెల్లడించారు.
వివరాలు
మూడు నెలల ఆలస్యంతో అమలు
వాస్తవానికి వీబీ జీరామ్‌జీ పథకం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రావాల్సి ఉన్నా, వివిధ కారణాలతో మూడు నెలలు ఆలస్యమై జులై 1 నుంచి ప్రారంభం కానుంది. అయితే 2026-27 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో గ్రామీణ శ్రామికులకు ఉపాధి కొరత తలెత్తకుండా, గత మూడు నెలల కాలానికి పాత ఉపాధి హామీ పథకం ద్వారానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 13.90 కోట్ల పనిదినాలను కేటాయించింది.