AP New Scheme: ఏపీలో పేద బ్రాహ్మణుల కోసం మరో కొత్త పథకం.. త్వరలో ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
సంక్రాంతి పండుగ ఆనందాన్ని ప్రజలకు మరింత ఎక్కువగా తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని శుభవార్తలు ప్రకటించింది. కొత్త పథకాలను ప్రారంభిస్తూ, ఇప్పటికే ఉన్న ప్రభుత్వ స్కీమ్లలో ప్రజలకు ఎక్కువ ప్రయోజనం కలిగే విధంగా పలు మార్పులు చేసినట్లు వెల్లడించింది. విద్యుత్ బిల్లుల్లో తగ్గింపు, కొత్త అన్న క్యాంటీన్ల ప్రారంభం వంటి కార్యక్రమాలు ఈ సంక్రాంతి సందర్భంగా అమల్లోకి రాబోతున్నాయి. అదే సమయంలో, త్వరలో మరో కొత్త పథకాన్ని కూడా లాంచ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే పథకానికి సంబంధించిన ముఖ్య ప్రకటన కూడా ప్రభుత్వం ద్వారా వెలువడింది. ఈ కొత్త పథకం ద్వారా ప్రతి అర్హుడి అకౌంట్లో రూ.10,000 జమ చేయనున్నారు.
వివరాలు
పేద బ్రాహ్మణుల కోసం 'గరుడ' పథకం
రాష్ట్రంలోని పేద బ్రాహ్మణుల కోసం త్వరలో 'గరుడ' పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా బ్రాహ్మణ కుటుంబంలో ఎవరైనా వ్యక్తి మరణిస్తే, సంబంధిత కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సాయం నేరుగా అకౌంట్లో జమ చేయబడుతుంది. కష్ట సమయంలో బ్రాహ్మణ కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందించడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెడుతోంది. ఈ పథకం అమలు కోసం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభం అయ్యింది. ఇటీవల అమరావతి సచివాలయంలో మంత్రి సవిత, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ కలిసి, పథకం విధివిధానాలు, అమలుపై సుదీర్ఘ చర్చ నిర్వహించారు.
వివరాలు
త్వరలో మార్గదర్శకాల విడుదల
గరుడ పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు త్వరలో ప్రభుత్వం ప్రకటించనుంది. ఆ తర్వాత మాత్రమే పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయి.2014లో చంద్రబాబు నాయుడు బ్రాహ్మణుల సంక్షేమం కోసం బ్రాహ్మణ కార్పొరేషన్‌ను స్థాపించారు. ఈ కార్పొరేషన్ ద్వారా నిరుపేద బ్రాహ్మణులకు అనేక పథకాలు అమలు చేయబడుతున్నాయి. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం గాయత్రి,వేదవ్యాస,వశిష్ట,ద్రోణాచార్య,చాణక్య,కల్యాణ మస్తు, కశ్యప, భారతి, భారతి విదేశీ విద్య వంటి పథకాలను బ్రాహ్మణుల సంక్షేమం కోసం అమలు చేసింది. అయితే ఆ తర్వాత ఈ పథకాలు నిలిచిపోగా.. ఇప్పుడు వాటిని మళ్లీ పునరుద్ధరించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. త్వరలోనే అన్ని పథకాలు పునరుద్దరించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.