చంద్రబాబు సభల ఎఫెక్ట్: రోడ్ షోలు, ర్యాలీలపై ఏపీ సర్కారు నిషేధం
రోడ్ షోలు, ర్యాలీల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సభల కోసం రాష్ట్ర, మున్సిపల్, పంచాయత్ రాజ్ రహదారులు కాకుండా.. ప్రత్యామ్నాయ స్థలాలను ఎంపిక చేసుకోవాలని హోం మంత్రిత్వ శాఖ సూచించింది. రోడ్లకు దూరంగా, ప్రజలకు ఇబ్బంది లేని చోట్ల అనుమతులు ఇవ్వాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఒకవేళ.. రోడ్ షోలు, ర్యాలీలకు అనుమతి ఇవ్వాలనుకుంటే.. అరుదైన సందర్భాల్లో.. షరతులతో కూడిన అనుమతి ఇస్తామని హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిబంధనలు అతిక్రమిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.
రాజకీయ కోణం ఉందా?
ఇటీవల చంద్రబాబు కందుకూరు, గుంటూరులో నిర్వహించిన కార్యక్రమాల్లో తొక్కిసలాట జరిగి.. పలువురు మృతి చెందారు. కందుకూరులో 8మంది, గుంటూరు ముగ్గురు మహిళలు చనిపోయారు. ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. తాజా ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వుల వెనుక రాజకీయ కోణం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల చంద్రబాబు విస్తృతంగా రోడ్ షోలు, ర్యాలీలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబును ప్రజల్లోకి వెళ్లనీయకుండా చేసేందుకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులను తీసుకొచ్చినట్లు టీడీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వులు.. త్వరలో లోకేశ్ చేపట్టనున్న పాదయాత్రపై ఏ మేరకు ప్రభావం చూపిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.