Anna Hazare: అన్నా హజారేకు తీవ్ర అస్వస్థత.. ముంబయి ఆసుపత్రి ఐసీయూలో చికిత్స
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే (87) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆరోగ్యం విషమించడంతో సోమవారం ముంబయిలోని బాంబే ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చేర్చారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. హజారే ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. తీవ్ర వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో పాటు డీహైడ్రేషన్ సమస్య తలెత్తడంతో తొలుత రాలేగావ్ సిద్ధి సమీపంలోని ఆసుపత్రిలో హజారేకు చికిత్స అందించారు. అయితే అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో మెరుగైన వైద్యం కోసం ముంబైకి తరలించారు. ఆయన కిడ్నీల పనితీరుపైనా వైద్యులు ప్రత్యేకంగా దృష్టి సారించి పరిశీలిస్తున్నారు.
వివరాలు
ఆరోగ్య వివరాలపై రానున్న అధికారిక ప్రకటన
ప్రస్తుతం డాక్టర్ గౌతమ్ భన్సాలీ ఆధ్వర్యంలో హజారేకు వైద్యం కొనసాగుతోంది.
ఆయనకు అవసరమైన పలు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల ఫలితాలు అందిన తర్వాత తదుపరి చికిత్సపై వైద్యులు నిర్ణయం తీసుకోనున్నారు.
ఇదే సమయంలో హజారేకు సంబంధించిన కీలక ఆరోగ్య సూచికలను వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
హజారే అనారోగ్యానికి గురైన విషయం తెలియడంతో దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు, మద్దతుదారుల్లో ఆందోళన నెలకొంది.
ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.
అన్ని వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఆయన ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాలు
అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు
అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించిన సామాజిక కార్యకర్తగా అన్నా హజారేకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది.
మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధిని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు.
జల సంరక్షణ, అటవీ అభివృద్ధి, గ్రామీణ స్వావలంబనతో పాటు మద్యపాన వ్యతిరేక కార్యక్రమాలకు ఆయన ప్రాధాన్యం ఇచ్చారు.
ఈ చర్యలతో రాలేగావ్ సిద్ధి రూపురేఖలు గణనీయంగా మారాయి. సమాచార హక్కు చట్టం, జనలోక్‌పాల్ బిల్లు కోసం అన్నా హజారే చేపట్టిన ఉద్యమాలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి.
వివరాలు
1992లో పద్మభూషణ్
అవినీతిపై పోరాటానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా 1992లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
ఇటీవల విద్యార్థుల ఆందోళనలకు సంబంధించిన పరిణామాలపై కూడా హజారే స్పందించారు.
అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
ప్రజలకు సంబంధించిన సమస్యలను హింసాత్మక మార్గాల్లో కాకుండా చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.