Page Loader
Liquor Scam: లిక్కర్ స్కాంలో మరో కీలక మలుపు.. మరోసారి విజయసాయిరెడ్డికి సిట్ నోటీసు!
లిక్కర్ స్కాంలో మరో కీలక మలుపు.. మరోసారి విజయసాయిరెడ్డికి సిట్ నోటీసు!

Liquor Scam: లిక్కర్ స్కాంలో మరో కీలక మలుపు.. మరోసారి విజయసాయిరెడ్డికి సిట్ నోటీసు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 11, 2025
10:05 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ లిక్కర్‌ స్కామ్‌ దర్యాప్తులో సిట్‌ తీవ్రత పెంచింది. ఈ క్రమంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి రెండోసారి నోటీసులు జారీ చేసింది. విచారణ నిమిత్తం శుక్రవారం ఉదయం 10 గంటలకు హాజరు కావాలంటూ నోటీసులు పంపించింది. గతంలో ఏప్రిల్ 18న సిట్ విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మద్యం అక్రమాల వెనుక ముఖ్య సూత్రధారి కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అని ఆరోపించిన ఆయన, మూడు సార్లు జరిగిన మద్యం పాలసీ సిట్టింగుల్లో తాను ఉన్నా, ఆ పాలసీతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు మళ్లీ ఆయనకు సిట్‌ నోటీసులు ఇవ్వడం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది.

Details

విచారణ వేగవంతం 

ఈసారి విచారణలో విజయసాయి ఏమైనా కొత్త నిజాలు బయటపెడతారా? అన్న ఆసక్తి నెలకొంది. లిక్కర్ కేసు దర్యాప్తులో సిట్‌ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనుచరులను అరెస్ట్ చేసిన అధికారులు, మరొక కీలక అభియోగదారులైన A35 బాలాజీ కుమార్ యాదవ్, A36 యద్దాల నవీన్‌లను మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో పట్టుకున్నారు. కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న వీరిని సెల్‌ఫోన్‌ లొకేషన్ల ఆధారంగా గుర్తించి విజయవాడకు తరలించారు. ఈ ఇద్దరూ లిక్కర్ డబ్బుల ట్రాన్స్‌ఫర్‌లో కీలకంగా వ్యవహరించారని భావిస్తున్నారు.

Details

మోహిత్‌రెడ్డికి కోర్టులో చుక్కెదురు

ఇక లిక్కర్‌ కేసులో A39గా ఉన్న చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి కూడా సిట్‌ విచారణ నోటీసులు పంపింది. ముందస్తు, మధ్యంతర బెయిల్ పిటిషన్లు వేయగా, ACB కోర్టు అవి తిరస్కరించింది. భాస్కర్‌రెడ్డి అరెస్ట్ తర్వాత మోహిత్‌రెడ్డి కనిపించకుండా పోవడం, కోర్టు వద్ద బెయిల్ నిరాకరించడం ఈ కేసును మరింత ఆసక్తికరంగా మార్చాయి.

Details

ఉత్కంఠను పెంచుతున్న దర్యాప్తు 

ఇక మరోవైపు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని కస్టడీకి తీసుకోవడానికి కోర్టు నుంచి సిట్‌కు అనుమతి లభించింది. ఇదిలా ఉండగా తెలంగాణ నుంచి ఎన్నికల సమయంలో ఏపీకి భారీగా డబ్బులు తరలించారన్న ఆరోపణలు కూడా బాలాజీ కుమార్‌పై ఉన్నాయి. మొత్తంగా ఒకవైపు విచారణ వేగవంతం మరోవైపు అరెస్టులు, బెయిల్ తిరస్కరణలు, విజయసాయిరెడ్డికి మళ్లీ నోటీసులు ఇవన్నీ కలిపి ఏపీ లిక్కర్ కేసు మరింత వేడెక్కించే దశకు చేరుకుంది.