AP: ఏపీలో పరిషత్ ఎన్నికల సందడి.. నవంబర్ 4, 5 తేదీల్లో సెలవులు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో అధికారులు ఇప్పుడు పరిషత్ ఎన్నికలపై దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నవంబర్ 5న పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఆటంకాలు లేకుండా, ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రభుత్వం రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పోలింగ్ కేంద్రాల ఏర్పాట్ల కోసం నవంబర్ 4న, పోలింగ్ నిర్వహణ కోసం నవంబర్ 5న సెలవులు ప్రకటించింది. పోలింగ్ కేంద్రాలుగా వినియోగించే పాఠశాలలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ఈ సెలవులు వర్తిస్తాయి.
వివరాలు
నవంబర్ 7న ఓట్ల లెక్కింపు ప్రక్రియ
ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు, దుకాణాల్లో పనిచేసే కార్మికులకు కూడా నవంబర్ 5న వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. వాస్తవానికి పరిషత్ ఎన్నికల పోలింగ్ నవంబర్ 3న జరగాల్సి ఉంది.
అయితే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్లో మార్పులు రావడంతో పోలింగ్ తేదీని వాయిదా వేశారు.
తాజా షెడ్యూల్ ప్రకారం నవంబర్ 5న పోలింగ్ నిర్వహించనుండగా, నవంబర్ 7న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
వివరాలు
రాష్ట్రవ్యాప్తంగా బరిలో 50 వేలకు పైగా అభ్యర్థులు
ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
మొత్తం 9,829 ఎంపీటీసీ స్థానాలకు 46,045 మంది అభ్యర్థులు, 659 జెడ్పీటీసీ స్థానాలకు 4,770 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
టీడీపీ, వైసీపీతో పాటు జనసేన, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు.
ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.