AP Govt: ప్రైవేట్ స్కూళ్లలో 25% ఉచిత సీట్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం-2009 అమలుపై కీలక నిర్ణయం తీసుకుంది. చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లోని 25 శాతం సీట్లను నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కేటాయించాల్సి ఉంటుంది. ఈ విధానం అమలుకు సంబంధించిన ప్రస్తుత మార్గదర్శకాలను సవరించి, మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఈ రిజర్వేషన్ ద్వారా పూర్తి ప్రయోజనం అందేలా చూడడమే కమిటీ ఏర్పాటు ప్రధాన ఉద్దేశం. ఈ అంశంపై సమగ్రంగా అధ్యయనం చేసి, అవసరమైన మార్పులను సూచించేందుకు 16 మంది సభ్యులతో కమిటీని నియమించింది.
వివరాలు
25శాతం ఉచిత అడ్మిషన్ల విధానం అమలుకు కొత్త మార్గదర్శకాలను రూపొందించడంపై కమిటీ దృష్టి
పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.
సమగ్రశిక్షా ఎస్పీడీ కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ప్రతినిధులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘాల ప్రతినిధులు,స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు కూడా కమిటీలో చోటు కల్పించారు.
ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ జారీ చేసిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత నిబంధనలను సవరించనున్నారు.
25శాతం ఉచిత అడ్మిషన్ల విధానం సమర్థంగా అమలయ్యేలా కొత్త మార్గదర్శకాలను రూపొందించడంపై కమిటీ దృష్టి సారించనుంది.
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు.
కమిటీ త్వరలో సమావేశమై అంశాలను పరిశీలించి,కొత్త మార్గదర్శకాలపై ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది.
వివరాలు
173 మందికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు
మరోవైపు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం 'రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు-2026'ను ప్రకటించింది.
విద్యారంగంలో విశేష సేవలు అందించిన మొత్తం 173 మందిని ఈ అవార్డులకు ఎంపిక చేసింది.
వీరిలో పాఠశాల విద్యా విభాగానికి చెందిన 79 మంది, ఇంటర్ విద్య నుంచి 24 మంది, సాంకేతిక విద్య విభాగం నుంచి 14 మంది, ఉన్నత విద్యా విభాగం నుంచి 56 మంది ఉన్నారు.
ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఘనంగా సత్కరించనున్నారు.
వారికి ప్రశంసాపత్రం, జ్ఞాపిక, పతకం, శాలువాతో పాటు రూ.20 వేల నగదు బహుమతిని అందజేయనున్నారు.