AP Local Body Polls: స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక నిర్ణయం.. పంచాయతీలకు మూడు దశల్లో పోలింగ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) సన్నద్ధమవుతోంది. గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. పురపాలక సంఘాలు,నగరపాలక సంస్థలు,నగర పంచాయతీలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా తెలిపారు. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కారమై, ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. స్థానిక ఎన్నికల సన్నద్ధతపై గురువారం విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వివరాలు
రెండు దశల్లో ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికలు
ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా చర్యలు, పోలింగ్ నిర్వహణకు అవసరమైన సదుపాయాలపై అధికారులతో చర్చించారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఒకే దశలో నిర్వహిస్తే పోలీసు బందోబస్తు పరంగా ఇబ్బందులు ఎదురవుతాయని పది జిల్లాల ఎస్పీలు ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. వారి సూచనలను పరిశీలించి నిర్ణయం ప్రకటిస్తామని అనిల్‌చంద్ర పునేఠా తెలిపారు.
పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు కూడా రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ సూచించారు.
తమ జిల్లాలో తొమ్మిది పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయని, వాటన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఇబ్బందికరంగా ఉంటుందని వివరించారు.
వివరాలు
నోటిఫికేషన్ వెలువడిన 14 రోజుల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి
ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్లు వివరించగా, పోలీసు బందోబస్తు ప్రణాళికలను ఎస్పీలు వెల్లడించారు.
మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై పురపాలక శాఖ కమిషనర్ సంపత్‌కుమార్, పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ ప్రజంటేషన్లు ఇచ్చారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి 14 రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు.
పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది.
అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల ఎన్నికల ప్రక్రియను నోటిఫికేషన్ వెలువడిన 15 రోజుల్లో పూర్తి చేయనున్నారు.
వివరాలు
నోటిఫికేషన్ వెలువడిన 14 రోజుల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియకు 16 రోజుల గడువు నిర్ణయించారు. ఈ రెండు రకాల ఎన్నికల్లో పోలింగ్ పూర్తయిన రెండు రోజుల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా నిర్వహిస్తారు. మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలను రాజకీయ పార్టీల ప్రాతిపదికన నిర్వహించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్, షెడ్యూల్‌లలో ఏది ముందుగా విడుదలైతే, ఆ తేదీ నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుంది.
ఎన్నికల కోసం మొత్తం 1,05,432 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. వీటికి అదనంగా తెలంగాణ నుంచి 17,650 బ్యాలెట్ బాక్సులను తెప్పించారు.
వివరాలు
అన్ని జిల్లాల్లో యంత్రాంగం సిద్ధం: ఎస్‌ఈసీ
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా విలేకర్లతో మాట్లాడారు.
అన్ని జిల్లాల్లోనూ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు.
ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని సిద్ధం చేసినట్లు చెప్పారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించాలన్న అధికారుల సూచనలను పరిశీలించి తుది నిర్ణయం వెల్లడిస్తామని స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టులో కేసులు పరిష్కారమై, ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తామని వివరించారు.