Andhra Pradesh Municipal Elections: ఏపీలో 13 పోలింగ్ కేంద్రాల్లో ప్రారంభమైన రీపోలింగ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 13 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం రీపోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు మొదలైన ఈ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. అనంతపురం,తిరుపతి, కడప కార్పొరేషన్లతో పాటు మాచర్ల,చీమకుర్తి,జమ్మలమడుగు,పులివెందుల ప్రాంతాల్లోని ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాల్లో అధికారులు రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. అనంతపురం కార్పొరేషన్లో 30/3, తిరుపతి కార్పొరేషన్లో 36/4,కడప కార్పొరేషన్లో 15/2 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. అలాగే మాచర్ల 23వ వార్డులోని 1, 2 పోలింగ్ కేంద్రాలు, ప్రకాశం జిల్లా చీమకుర్తిలో 14/1, జమ్మలమడుగులో 3/2, 17/1, 29/1 పోలింగ్ కేంద్రాల్లోనూ రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. పులివెందులలో 1, 3, 7, 8వార్డులకు చెందిన ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
వివరాలు
ఫిర్యాదులపై విచారణ జరిపి నివేదిక సమర్పించండి: ఎస్ఈసీ ఆదేశం
ఆదివారం ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.
కొన్ని స్థానాలు ఏకగ్రీవం కావడంతో 13కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలు జరిగినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్ఈసీ) ఫిర్యాదులు అందాయి.
ఈ ఫిర్యాదులపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్లను ఎస్ఈసీ ఆదేశించింది.
పలు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలు జరిగినట్లు జిల్లా కలెక్టర్లు విచారణ అనంతరం ఎస్ఈసీకి నివేదికలు సమర్పించారు.
ఈ నివేదికలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల సంఘం 13పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ మేరకు సంబంధిత జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సోమవారం ఆయా కేంద్రాల్లో అధికారులు తిరిగి పోలింగ్ నిర్వహిస్తున్నారు.