BC Protection Act : ఏపీలో బీసీ రక్షణ చట్టం.. కులం,వృత్తి పేరుతో దూషిస్తే కఠిన శిక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన వర్గాల గౌరవం,హక్కులకు చట్టబద్ధ రక్షణ కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం తీసుకురావడానికి చర్యలు వేగవంతం చేసింది. ఈ చట్టం అమల్లోకి వస్తే బీసీలను కులం లేదా సంప్రదాయ వృత్తుల పేరుతో అవమానించడం, దూషించడం లేదా వేధించడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన శిక్షలు విధించేలా నిబంధనలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర మంత్రులు ఎస్.సవిత, కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ చట్టం రూపకల్పనలో అన్ని వర్గాల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రులు తెలిపారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశం నిర్వహించి సూచనలు స్వీకరించామని, త్వరలో జిల్లా స్థాయిలో బీసీ సంఘాల ప్రతినిధులతోనూ చర్చలు జరిపి వారి అభిప్రాయాలను కూడా ముసాయిదాలో పొందుపరుస్తామని చెప్పారు.
వివరాలు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకే కూటమి ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం: సవిత
విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్ హోటల్‌లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత అధ్యక్షతన బీసీ రక్షణ చట్టం ముసాయిదాపై కీలక సమావేశం జరిగింది.
ఇందులో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొని చట్టంలోని వివిధ అంశాలపై తమ సూచనలు వెల్లడించారు.
అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మంత్రులు చట్టానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
మంత్రి సవిత మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకే కూటమి ప్రభుత్వం బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తోందని తెలిపారు.
బీసీలకు రాజకీయ,సామాజిక,ఆర్థిక రంగాల్లో సముచిత గుర్తింపు కల్పించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు.
బీసీలను వేధించడం,కులం లేదా వృత్తి పేరుతో దూషించడం వంటి చర్యలను ఈ చట్టం కింద శిక్షార్హమైన నేరాలుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు.
వివరాలు
దేశంలోనే తొలిసారిగా ఇలాంటి ప్రత్యేక చట్టం: సవిత
బీసీ రక్షణ చట్టానికి సంబంధించిన కేసుల పరిష్కారం వేగంగా జరిగేలా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు.
దేశంలోనే తొలిసారిగా ఇలాంటి ప్రత్యేక చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువస్తోందని ఆమె పేర్కొన్నారు.
సమావేశంలో ప్రజాప్రతినిధులు చేసిన సూచనలు,సలహాలను ఇప్పటికే సిద్ధం చేసిన బీసీ రక్షణ బిల్లు ముసాయిదాలో చేర్చనున్నట్లు తెలిపారు.
తదుపరి దశలో జిల్లా స్థాయిలో బీసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను కూడా సేకరించి తుది నివేదికను జాతీయ బీసీ కమిషన్కు పంపనున్నట్లు మంత్రి తెలిపారు.
కమిషన్ ఆమోదం లభించిన వెంటనే బీసీ రక్షణ బిల్లును రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
వివరాలు
బీసీలు సమాజానికి వెన్నెముకలాంటివారు
కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ చట్టాన్ని రాష్ట్రంలో త్వరగా అమలు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు.
బీసీల అభ్యున్నతే లక్ష్యంగా అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని మంత్రి సవిత గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,మంత్రి నారా లోకేశ్ కూడా బీసీలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలా నిరంతరం ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.
బీసీలు సమాజానికి వెన్నెముకలాంటివారని ఇద్దరు నాయకులు ఎప్పటికప్పుడు చెబుతున్నారని పేర్కొన్నారు.
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ,బీసీ రక్షణ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.
పార్టీ ఆవిర్భావం నుంచే బీసీలు తమకు అండగా నిలిచారని,వారు కుల వివక్షకు గురికాకుండా చట్టబద్ధ రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఈ చట్టానికి శ్రీకారం చుట్టామని చెప్పారు.
వివరాలు
గత రెండేళ్లుగా బీసీ రక్షణ చట్టంపై విస్తృతంగా చర్చలు
దేశంలో అనేకచట్టాలు ఉన్నప్పటికీ బీసీల రక్షణకోసం ప్రత్యేక చట్టం ఇప్పటివరకు లేదని వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వ పాలనలో బీసీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
మంత్రి నారా లోకేశ్ నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా బీసీలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు.
గత రెండేళ్లుగా బీసీ రక్షణ చట్టంపై విస్తృతంగా చర్చలు జరుపుతున్నామని,శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టే ముందు జాతీయ బీసీకమిషన్ సూచనలు కూడా తీసుకుంటామని వెల్లడించారు.
సమావేశంలో పాల్గొన్న పలువురు మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు బీసీ రక్షణచట్టాన్ని మరింత పటిష్టంగా రూపొందించాలని సూచించారు.
బీసీలను కులం లేదా వృత్తి ఆధారంగా అవమానించే ఘటనలు జరగకుండా కఠిననిబంధనలు అమలు చేయడంతో పాటు ప్రజల్లో చట్టంపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించాలని అభిప్రాయపడ్డారు.