AP: ఖాళీ భూములకు కొత్త రూపం.. పీపీపీ విధానంలో భారీ ప్రాజెక్టులకు సన్నాహాలు
ఈ వార్తాకథనం ఏంటి
నగరాల్లో ఖాళీగా ఉన్న విలువైన భూములను వృథాగా ఉంచకుండా సద్వినియోగం చేసేందుకు పట్టణాభివృద్ధి సంస్థలు చర్యలు చేపడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో ఈ స్థలాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా అధికారులు తొలిదశలో 1,338.84 ఎకరాల భూమిని గుర్తించి ప్రాథమికంగా సిద్ధం చేశారు. ఈ భూముల్లో ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆసక్తి ఉన్న సంస్థలు, వ్యక్తుల నుంచి ప్రతిపాదనలు స్వీకరించేందుకు త్వరలో టెండర్లు (ఆర్‌ఎఫ్‌పీ) ఆహ్వానించనున్నారు. పట్టణాభివృద్ధి సంస్థల వద్ద భూములు ఉన్నప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు అవసరమైన భారీ పెట్టుబడులు పెట్టే ఆర్థిక సామర్థ్యం ప్రస్తుతం లేదు. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలవుతున్న పీపీపీ విధానాన్ని ఇక్కడా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.
వివరాలు
ప్రతిపాదిత ప్రాజెక్టులివే
ఇందులో భాగంగా ముందుగా పట్టణాభివృద్ధి సంస్థలు తమ పరిధిలోని భూములను అభివృద్ధికి అనువుగా సిద్ధం చేస్తాయి.
అనంతరం ఆయా స్థలాల్లో వివిధ రకాల ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ప్రైవేట్ సంస్థలను ఆహ్వానిస్తాయి.
ఈ పథకం కింద మొత్తం తొమ్మిది రకాల ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు.
ఆసుపత్రులు, వాణిజ్య సముదాయాలు, సోలార్ పార్కులు, హోటళ్లు, రిసార్ట్‌లు, పెట్రోల్, డీజిల్ ఔట్‌లెట్లు, ఆగ్రో ట్రేడ్ కేంద్రాలు, ఎడ్యుకేషన్ హబ్‌లు, రెసిడెన్షియల్ లేఔట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, వేర్‌హౌసింగ్ వంటి ప్రాజెక్టులకు అవకాశం కల్పించనున్నారు.
వివరాలు
ప్రతిపాదిత ప్రాజెక్టులివే
తొలిదశలో తిరుపతి, అనంతపురం పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో రెండు ప్రాజెక్టులకు సంబంధించి ప్రైవేట్ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను త్వరలో ఆహ్వానించనున్నారు.
తిరుపతి సమీపంలోని శెట్టిపల్లెలో సుమారు 223 ఎకరాల్లో లేఔట్ అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
అలాగే తిమ్మాజికండ్రిగలో మరో 40 ఎకరాల్లో లేఔట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
అనంతపురం పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో స్విమ్మింగ్‌పూల్ ఏర్పాటు చేసేందుకు డిజైన్‌ను కూడా సిద్ధం చేశారు.
ఇక శ్రీకాకుళం, బొబ్బిలి, రాజమహేంద్రవరం, కాకినాడ, కర్నూలు, అన్నమయ్య పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో సుమారు 654 ఎకరాల్లో వివిధ ప్రాజెక్టులను చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ విధానంతో పట్టణాభివృద్ధి సంస్థలకు చెందిన భూములను నేరుగా విక్రయించే పద్ధతికి స్వస్తి పలకాలని అధికారులు భావిస్తున్నారు.
వివరాలు
భాగస్వామ్య వ్యాపారానికీ అవకాశం
భూములను అమ్మడం కంటే ఖాళీ స్థలాలను వివిధ వ్యాపార అవసరాల కోసం ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇవ్వడం ద్వారా దీర్ఘకాలికంగా ఆదాయం పొందడం ప్రయోజనకరమని అభిప్రాయపడుతున్నారు.
పట్టణాభివృద్ధి సంస్థలకు చెందిన భూముల చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో ప్రైవేట్ వ్యక్తులకు చెందిన స్థలాలు కూడా ఉన్నాయి.
అయితే ఆయా ప్రాంతాల్లో ప్రైవేట్ యజమానులు, పట్టణాభివృద్ధి సంస్థలు రెండూ చొరవ తీసుకోకపోవడంతో చాలా భూములు ఇప్పటివరకు ఉపయోగంలోకి రాలేదు.
ఇలాంటి ప్రాంతాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు సంబంధిత ప్రైవేట్ భూ యజమానులు ముందుకొస్తే.. వారి స్థలాలకు ఆనుకుని ఉన్న పట్టణాభివృద్ధి సంస్థల భూములను కూడా లీజుకు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.
వివరాలు
భాగస్వామ్య వ్యాపారానికీ అవకాశం
ఈ విధానంతో ప్రైవేట్ భూ యజమానులు, పట్టణాభివృద్ధి సంస్థలు కలిసి వ్యాపార ప్రాజెక్టులను అభివృద్ధి చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.
తద్వారా ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న భూములను ఆర్థిక కార్యకలాపాలకు వినియోగించడంతో పాటు పట్టణాభివృద్ధి సంస్థలకు కూడా ఆదాయ మార్గం ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు.