AP DSC Notification: త్వరలో మరో డీఎస్సీ.. 15న నోటిఫికేషన్ విడుదలకు సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
కూటమి ప్రభుత్వం మరో ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) నిర్వహణకు సిద్ధమవుతోంది. 2026కు సంబంధించిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను అక్టోబరు 15న విడుదల చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ వివిధ యాజమాన్యాల పరిధిలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీల వివరాలను సేకరించింది. ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు అవసరమవుతాయో గుర్తించి ప్రాథమికంగా ప్రతిపాదనలు రూపొందించింది. డీఎస్సీతో పాటు డైట్, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ), గ్రంథాలయాల్లో ఖాళీల భర్తీకి కూడా నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ గతంలో ప్రకటించారు. అందులో భాగంగానే 2026లో మరో డీఎస్సీ నిర్వహణకు చర్యలు చేపడుతున్నారు.
వివరాలు
పాఠశాల విద్యలోనే 2,250 పోస్టులు
ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, పురపాలక పాఠశాలలతో పాటు జువనైల్ సంక్షేమం, గిరిజన గురుకులాలు, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, దివ్యాంగుల, బీసీ సంక్షేమ విద్యా సంస్థల్లో టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
అన్ని విభాగాలను కలిపి 2,500కుపైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పాఠశాల విద్యాశాఖ ప్రాథమికంగా సిద్ధం చేసిన జాబితా ప్రకారం ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, పురపాలక పాఠశాలల్లో కలిపి సుమారు 2,250 ఉపాధ్యాయ పోస్టులు ఉండనున్నాయి.
అయితే ఈ సంఖ్యపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
వివరాలు
డైట్, ఎస్‌సీఈఆర్టీ పోస్టులు కూడా
ఇతర విద్యా విభాగాల్లో ఇప్పటివరకు గుర్తించిన ఖాళీల ఆధారంగా మరో 300 వరకు పోస్టులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
డీఎస్సీ ద్వారా భర్తీ చేసే టీచర్ పోస్టులతో పాటు డైట్, ఎస్‌సీఈఆర్టీలో లెక్చరర్ పోస్టులు 160 వరకు ఉన్నాయి.
జూనియర్ లెక్చరర్ పోస్టులు 209, లైబ్రేరియన్ పోస్టులు సుమారు 100 వరకు ఉండనున్నాయి.
ఈ పోస్టులను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా భర్తీ చేయనున్నారు.
వివరాలు
2029 వరకు ముందస్తు ప్రణాళిక
ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పాఠశాల విద్యాశాఖ ముందుగానే నియామకాలపై ప్రణాళిక రూపొందిస్తోంది.
ఇందులో భాగంగా 2026 నుంచి 2029 వరకు ఏటా భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలను ప్రాథమికంగా సిద్ధం చేసింది.
మొత్తం ఖాళీల్లో 70 శాతం పోస్టులను పదోన్నతుల ద్వారా, మిగిలిన 30 శాతం పోస్టులను నేరుగా నియామకం చేపట్టే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.
2026తో పాటు 2027, 2028, 2029 సంవత్సరాలకు సంబంధించిన ఖాళీల జాబితాను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు.