Andhra Pradesh: మార్చి 31లోపు రెరా రిజిస్ట్రేషన్ చేస్తే జరిమానాల్లో 50% రాయితీ: ఏపీ రెరా ఛైర్మన్ శివారెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
కొత్తగా చేపట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టులను ఇప్పటివరకు రెరాలో నమోదు చేయించుకోని స్థిరాస్తి సంస్థలకు, అలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ త్రైమాసిక పురోగతి నివేదికలు (క్యూపీఆర్‌లు) సమర్పించని సంస్థలకు రాష్ట్ర స్థిరాస్తి నియంత్రణ సంస్థ (ఏపీ రెరా) కీలక రాయితీ ప్రకటించింది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను మార్చి 31లోపు రెరాలో రిజిస్ట్రేషన్ చేయించుకుని, పెండింగ్‌లో ఉన్న క్యూపీఆర్‌లను సమర్పిస్తే, విధించాల్సిన జరిమానాలో 50 శాతం వరకు తగ్గింపు ఇస్తామని తెలిపింది. ఈ అవకాశాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని, నిర్ణీత గడువు దాటితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ఏపీ రెరా ఛైర్మన్ శివారెడ్డి హెచ్చరించారు. సోమవారం ఆయన రెరా సభ్యులు డి.శ్రీనివాసరావు, కులదీప్, వెంకటరత్నం, వెంకటేశ్వర్లు, డైరెక్టర్ నాగసుందరితో కలిసి మీడియాతో మాట్లాడారు.
వివరాలు
ప్రాజెక్టు మొత్తం విలువలో 10 శాతం వరకు అపరాధ రుసుము
ఇప్పటికీ కొన్ని స్థిరాస్తి సంస్థలు రెరా రిజిస్ట్రేషన్‌ను పట్టించుకోవడం లేదని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న సంస్థలలోనూ దాదాపు మూడో వంతు సంస్థలు త్రైమాసిక పురోగతి నివేదికలు సమర్పించడం లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై ఇప్పటికే చట్టప్రకారం జరిమానాలు విధిస్తున్నామని,అయితే 50 శాతం రాయితీ ఇవ్వడం ద్వారా గడువులోగా ముందుకొచ్చేలా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. మార్చి 31లోపు రెరా రిజిస్ట్రేషన్ చేయించుకోని హౌసింగ్ ప్రాజెక్టులపై ఆ తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మొదటగా నోటీసులు జారీ చేసి, ప్రాజెక్టు మొత్తం విలువలో 10 శాతం వరకు అపరాధ రుసుము విధిస్తామని తెలిపారు. అంతేకాదు, ఆ ప్రాజెక్టుల ఫ్లాట్ల విక్రయాలు, ప్రకటనలపై కూడా ఆంక్షలు విధిస్తామని చెప్పారు.
వివరాలు
క్యూపీఆర్‌లను ఆన్‌లైన్ ద్వారానే అప్‌లోడ్ చేసే సౌకర్యం
త్రైమాసిక పురోగతి నివేదికలు సమర్పించడం ద్వారా ప్రాజెక్టు నిర్మాణం ఏ దశలో ఉందో రెరాకు స్పష్టంగా తెలుస్తుందని ఛైర్మన్ వివరించారు. అలాగే ఫ్లాట్ల కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన నిధులను ఇతర ప్రాజెక్టులకు మళ్లించే అవకాశం ఉండదన్నారు. ప్రాజెక్టులు గడువులోపు పూర్తి అయ్యేలా చూడాల్సిన బాధ్యత రెరాపై ఉందని పేర్కొన్నారు. క్యూపీఆర్‌లను ఆన్‌లైన్ ద్వారానే అప్‌లోడ్ చేసే సౌకర్యం ఉందని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత రెరాలో అఫిడవిట్ దాఖలు చేస్తే, ఆపై మళ్లీ నోటీసులు జారీ చేయబోమని స్పష్టం చేశారు. రెరాపై ప్రజల్లో, అలాగే వ్యాపారుల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో ఈ నెల 28, 29 తేదీల్లో కడపలో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.