Andhra Pradesh : ఏపీలో పునరుత్పాదక విద్యుత్‌కు వేగం.. రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులపై ఫోకస్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను వేగంగా అమల్లోకి తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే అనుమతులు పొందిన ప్రాజెక్టులు త్వరితగతిన గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి ప్రతి నెలా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ప్రాజెక్టుల పురోగతిని పరిశీలిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఒక్కో జిల్లాకు ఒక అధికారిని, ప్రతి మూడు జిల్లాలకు ఒక ప్రాజెక్టు డైరెక్టర్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రాజెక్టులకు అవసరమైన భూముల సేకరణను వేగవంతం చేసేందుకు రిటైర్డు రెవెన్యూ, అటవీ శాఖ అధికారుల సేవలను కూడా వినియోగిస్తోంది.
వివరాలు
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా..
గత రెండేళ్లలో రాష్ట్రంలో వివిధ రంగాల్లో పరిశ్రమల ఏర్పాటుకు దాదాపు రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది.
వీటిలో కొన్ని సంస్థల ఏర్పాటుకు ఇప్పటికే అనుమతులు మంజూరు చేసింది. ఆయా పరిశ్రమలకు అవసరమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విద్యుత్ ప్రణాళికను రూపొందించింది.
రాష్ట్ర భవిష్యత్తు విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 160.50 గిగావాట్ల (1,60,500 మెగావాట్ల) పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
పవన, సౌర విద్యుత్‌తో పాటు పంప్డ్ స్టోరేజీ పవర్ (పీఎస్‌పీ), బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ (బెస్) ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది.
వివరాలు
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా..
ఈ పాలసీ ద్వారా మొత్తం రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 7.5 లక్షల మందికి ఉపాధి కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం.
ఇందులో భాగంగా ఇప్పటికే 49 సంస్థలకు 112.45 గిగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది.
ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చితే సుమారు రూ.6.99 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది.
అలాగే దాదాపు 5.46 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
వివరాలు
కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లకు ప్రోత్సాహం..
రాష్ట్రంలో రోజుకు 10,000 టన్నుల (టీపీడీ) సామర్థ్యంతో కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది.
అయితే నిర్దేశించిన లక్ష్యాన్ని మించి 11,457 టీపీడీ సామర్థ్యం కలిగిన ప్లాంట్ల ఏర్పాటుకు ఇప్పటికే అనుమతులు ఇచ్చింది.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రిలయన్స్ సంస్థ 500 సీబీజీ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది.
ఈ ప్రాజెక్టుల ద్వారా రూ.65,456 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా, సుమారు 2.52 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.
వివరాలు
కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లకు ప్రోత్సాహం..
ఎలక్ట్రోలైజర్ తయారీ యూనిట్లపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. మొత్తం 3 గిగావాట్ల సామర్థ్యంతో ఎలక్ట్రోలైజర్ల తయారీ యూనిట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి.
ఇందులో ఇప్పటికే రూ.2,000 కోట్ల పెట్టుబడితో 2 గిగావాట్ల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.
అదేవిధంగా ఏటా 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీపీఏ) ఉత్పత్తి సామర్థ్యంతో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది.
ఇందులో భాగంగా ఒక ఎంఎంటీపీఏ సామర్థ్యం కలిగిన ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది.