Amaravati: అమరావతిలో ఆప్కాబ్ ఐకానిక్ టవర్.. రూ.200 కోట్లతో భారీ నిర్మాణం
ఈ వార్తాకథనం ఏంటి
రాజధాని అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు (ఆప్కాబ్) కోసం రూ.200 కోట్ల వ్యయంతో అత్యాధునిక ఐకానిక్ భవనం నిర్మాణం చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టులో భవన నిర్మాణానికి రూ.87 కోట్లు, ఇంటీరియర్ పనులు మరియు ఇతర సౌకర్యాల కల్పనకు రూ.113 కోట్లు వెచ్చించనున్నారు. ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. ఈ భవనం నిర్మాణం కోసం లింగాయపాలెంలో 0.495 ఎకరాల స్థలాన్ని సీఆర్‌డీఏ కేటాయించింది. జీ+17 అంతస్తులతో నిర్మించనున్న ఈ భవనంలో అత్యున్నత అంతస్తుపై హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేయనున్నారు.
వివరాలు
2.09 లక్షల చదరపు అడుగులలో విస్తీర్ణం
మొత్తం 2.09 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఈ భవనంలో ఆప్కాబ్ పాలనా కార్యాలయంతో పాటు ఐటీ విభాగాలు, ఛైర్మన్, ఎండీ ఛాంబర్లు, ఇతర పరిపాలనా విభాగాలకు అవసరమైన సదుపాయాలు కల్పించనున్నారు. ప్రత్యేకంగా ఆప్కాబ్ అనే అక్షరాలు ప్రతిబింబించేలా భవన డిజైన్‌ను రూపొందించారు. నిర్మాణ బాధ్యతలను ఏపీఐఐసీకి అప్పగించగా, సాంకేతిక సహకారం కోసం ఐఐటీ హైదరాబాద్‌తో పాటు విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సేవలను వినియోగిస్తున్నారు.