APSRTC: దసరా పండుగకు ఏపీఎస్‌ఆర్టీసీ 5,261 ప్రత్యేక బస్సులు.. అదనపు ఛార్జీలు లేవు
ఈ వార్తాకథనం ఏంటి
దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పండుగ సమయంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా మొత్తం 5,261ప్రత్యేకబస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక సర్వీసుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా,ఆయా మార్గాల్లో సాధారణ బస్సులకు వర్తించే ఛార్జీలనే తీసుకోనున్నారు. పండుగకు వెళ్లేవారికి 3,207 ప్రత్యేక బస్సులు దసరా పండుగ ఈ నెల 20న ఉండటంతో..అక్టోబర్ 16 నుంచి 19వతేదీ వరకు ప్రత్యేక బస్సులను నడపనున్నారు. హైదరాబాద్,బెంగళూరు,చెన్నై నగరాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ నగరాలు,ప్రాంతాలకు వచ్చే ప్రయాణికులతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల మధ్య రాకపోకలు సాగించేవారి కోసం మొత్తం 3,207 ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేశారు.
వివరాలు
తిరుగు ప్రయాణానికి మరో 2,054 బస్సులు
దసరా పండుగ ముగిసిన తర్వాత తిరిగి తమ గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికుల కోసం అక్టోబర్ 20 నుంచి 25వ తేదీ వరకు మరో 2,054 ప్రత్యేక బస్సులను నడపనున్నారు.
సాధారణంగా నడిచే దూరప్రాంత సర్వీసులకు అదనంగా ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు.
పండుగ రద్దీని తగ్గించి, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఆర్టీసీ ఈ ప్రణాళికను సిద్ధం చేసింది.
ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే
దసరా సందర్భంగా నడిపే 5,261 ప్రత్యేక బస్సుల్లోనూ ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని ఆర్టీసీ స్పష్టం చేసింది.
ఆయా మార్గాల్లో సాధారణంగా నడిచే బస్సులకు ఎంత ఛార్జీ ఉంటుందో.. ప్రత్యేక సర్వీసుల్లోనూ అంతే వసూలు చేయనున్నారు.
వివరాలు
హైదరాబాద్‌కు రాకపోకలకు 1,186 బస్సులు
దీంతో పండుగ ప్రయాణాల కోసం ప్రత్యేక బస్సులను ఎంచుకునే ప్రయాణికులకు అదనపు ఛార్జీల భారం ఉండదు.
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లేవారి కోసం 533 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.
అలాగే, పండుగ తర్వాత ఏపీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చే ప్రయాణికుల కోసం 653 బస్సులను నడపనున్నారు.
ఈ రెండు దిశల్లో కలిపి మొత్తం 1,186 ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
వివరాలు
ప్రధాన నగరాలకు ప్రత్యేక సర్వీసులు
ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు ప్రధాన నగరాలకు ప్రత్యేక బస్సులను కేటాయించారు.
బెంగళూరుకు 475, చెన్నైకి 153, విజయవాడకు 1,053, విశాఖపట్నానికి 440, రాజమహేంద్రవరానికి 347, తిరుపతికి 247 బస్సులను నడపనున్నారు.
వీటితో పాటు ఇతర ప్రాంతాలకు రానూపోనూ కలిపి మరో 1,360 బస్సులను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేశారు.
మొత్తంగా దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని ఎదుర్కొనేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేసింది.
ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే వర్తించనుండటంతో పండుగ ప్రయాణికులకు కొంత ఊరట లభించనుంది.