Loading...
New Form 6: ఫారం-6 సవరణలను ఆమోదించలేదు.. సుప్రీంకోర్టు స్పష్టీకరణ
ఫారం-6 సవరణలను ఆమోదించలేదు.. సుప్రీంకోర్టు స్పష్టీకరణ

New Form 6: ఫారం-6 సవరణలను ఆమోదించలేదు.. సుప్రీంకోర్టు స్పష్టీకరణ

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 12, 2026
02:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫారం-6లో చేసిన సవరణలపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక స్పష్టీకరణ ఇచ్చింది. ఈ సవరణలను తాము ఎక్కడా ఆమోదించలేదని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం స్పష్టం చేసింది. ఫారం-6లో చేసిన మార్పులకు సుప్రీంకోర్టు ఆమోదం ఉందంటూ భారత ఎన్నికల సంఘం (ఈసీ) చేసిన వ్యాఖ్యలపై న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. బీహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)కు సంబంధించిన తీర్పు వెలువడిన సమయంలో కొత్త ఫారం-6 అందుబాటులోనే లేదని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్‌ పేర్కొన్నారు. కొత్త ఫారం-6లోని డిక్లరేషన్‌కు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిందంటూ ఈసీ చేసిన వ్యాఖ్యలను న్యాయస్థానం తప్పుబట్టింది. ఆ ఫారంలోని మార్పులకు తాము అనుమతి ఇచ్చినట్లు భావించకూడదని స్పష్టం చేసింది.

వివరాలు 

ఈసీ ఏకపక్ష నిర్ణయాలపై పిటిషన్లు

ఓటర్ల నమోదు ప్రక్రియలో ఎన్నికల సంఘం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుందని ఆరోపిస్తూ పలువురు పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

చట్టబద్ధమైన నిబంధనల్లో అవసరమైన సవరణలు చేయకుండానే ఈసీ ఫారం-6లో మార్పులు చేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు.

ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఫారం-6లో చేసిన సవరణలను తాము ఆమోదించలేదని పునరుద్ఘాటించింది.

ఈ ఫారంలో అసలు ఎవరు మార్పులు చేశారనే విషయాన్ని సంబంధిత రికార్డులను పరిశీలించి నిర్ధారిస్తామని తెలిపింది.

వివరాలు 

రికార్డుల పరిశీలన తర్వాత స్పష్టత

ఫారం-6లో మార్పులకు సంబంధించి అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది.

సవరణలు ఎవరు చేశారు? వాటికి సంబంధించి ఎలాంటి ప్రక్రియను అనుసరించారు? అనే అంశాలపై రికార్డుల పరిశీలన అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ADVERTISEMENT