BJP: జేపీ నడ్డా స్థానంలో ఫిబ్రవరి నెలాఖరులోగా బీజేపీకి కొత్త అధ్యక్షుడు
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కొత్త ఏడాదిలో నూతన జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ ఎంపిక ప్రక్రియ ఫిబ్రవరి నెలాఖరుకల్లా పూర్తి కావచ్చని పార్టీ సీనియర్ నేతలు తెలిపారు. రాష్ట్ర స్థాయి కొన్ని అధ్యక్షుల పదవీకాలం ముగియడంతో, వచ్చే నెలలో వారిని మార్చే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. బీజేపీ పార్టీ రాజ్యాంగం ప్రకారం, జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు ముందు కనీసం సగం రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎన్నికలు జరగాలి.
2024 లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా నడ్డా పదవీకాలాన్ని పొడిగింపు
''ఫిబ్రవరి చివరికి కొత్త జాతీయ అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంద''ని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. అయితే, కొత్త అధ్యక్షుడిగా కేంద్రమంత్రులలో ఒకరిని ఎంపిక చేస్తారా లేదా పూర్తిగా కొత్త వ్యక్తికి అవకాశం ఇస్తారా అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా 2020లో ఈ పదవిని చేపట్టారు. మూడోసారి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు, ఆయన ఆరోగ్యశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. సాధారణంగా పార్టీ అధ్యక్షుడి పదవీకాలం మూడు సంవత్సరాలే, కానీ 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నడ్డా పదవీకాలాన్ని పొడిగించారు.