Sudarshan Reddy: బీఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డికి గుండెపోటు.. హెల్త్ బులిటెన్‌లో వైద్యుల కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హనుమకొండలోని తన నివాసంలో ఉన్న సమయంలో ఆదివారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హనుమకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందించి ఆయన ఆరోగ్య పరిస్థితిని వెల్లడించారు. సుదర్శన్‌రెడ్డి ఆసుపత్రికి చేరేసరికి కార్డియాక్ అరెస్ట్‌కు గురైనట్లు వైద్యులు తెలిపారు. దాదాపు గంటపాటు సీపీఆర్ (CPR) నిర్వహించిన అనంతరం ఆయన చికిత్సకు స్పందించినట్లు వెల్లడించారు. అనంతరం నిర్వహించిన వైద్య పరీక్షల్లో గుండెకు రక్తాన్ని సరఫరా చేసే పల్మనరీ ఆర్టరీలో రక్తం గడ్డకట్టడంతో బ్లాకులు ఏర్పడినట్లు గుర్తించినట్లు వివరించారు.
వివరాలు
పల్స్ సాధారణ స్థితిలోనే ఉంది
ఆ బ్లాకులను కరిగించేందుకు ప్రత్యేక ఇంజెక్షన్ ఇచ్చిన అనంతరం యాంజియోగ్రామ్ నిర్వహించినట్లు చికిత్స అందించిన కార్డియాలజిస్ట్ డాక్టర్ మమత రెడ్డి తెలిపారు.
ప్రస్తుతం సుదర్శన్‌రెడ్డి పల్స్ సాధారణ స్థితిలోనే ఉందని, అయితే మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు వెంటిలేటర్ సాయంతో హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
పెద్ది సుదర్శన్‌రెడ్డి అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆసుపత్రికి చేరుకున్నారు.
ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన వారు, సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని అవసరమైన వైద్య చికిత్స అందించాలని సూచించారు.