పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిలను భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) సస్పెండ్ చేసింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు వారిని సస్పెండ్ చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ప్రకటించింది. ఇప్పటికే నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన శ్రీనివాస్‌రెడ్డితో కృష్ణారావు చేరిన ఒకరోజు తర్వాత సస్పెన్షన్ వేటు పడింది. కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి కృష్ణారావు హాజరై, ప్రజాస్వామ్య గొంతుకలను అణిచివేస్తున్నారని కేసీఆర్‌పై మండిపడ్డారు.
ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఉన్నాను: పొంగులేటి
బీఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు. ఇప్పుడు తాను స్వేచ్ఛగా ఉన్నానన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో ఇబ్బంది పెడుతున్న ప్రజల కోసం తన బలాన్ని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రజలకు సంక్షేమం అందించడంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పొంగులేటి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను ఓడించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కృష్ణారావు 2011లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. 2014లో కొల్లాపూర్ నుంచి టీఆర్‌ఎస్ టిక్కెట్‌పై ఎన్నికయ్యారు. 2014లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై ఖమ్మం నుంచి లోక్‌సభకు ఎన్నికైన శ్రీనివాస్‌రెడ్డి ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లోకి మారారు.