'భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు'; రాహుల్ అనర్హత వేటుపై స్పందించిన సీఎం కేసీఆర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తీవ్రంగా ఖండించారు. దీన్ని భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది చీకటి రోజుగా అభివర్ణించారు. శుక్రవారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలోని ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ప్రతిపక్షాలు తమ విభేదాలను వీడి ఐక్యంగా బీజేపీ దుశ్చర్యలను ఖండించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న దుష్ప్రచారాలను ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు.
ప్రతిపక్ష నేతలపై వేధింపులు నిత్యకృత్యంగా మారాయి: సీఎం కేసీఆర్
రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని హద్దులు దాటిందని, ఇది ప్రధాని నరేంద్ర మోదీ అహంకారాన్ని, నియంతృత్వ వైఖరిని ప్రతిబింబిస్తోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామిక వేదిక పార్లమెంటును కూడా తన హేయమైన కార్యకలాపాలకు ఉపయోగించుకుంటోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు ప్రమాదంలో ఉన్నాయని కేసీఆర్ అన్నారు. ప్రతిపక్ష నేతలపై వేధింపులు నిత్యకృత్యంగా మారాయన్నారు. మోదీ పాలన అన్ని విధాలుగా ఎమర్జెన్సీ కాలాన్ని అధిగమిస్తోందన్నారు.