Loading...
Tripura BSF-local clash: త్రిపురలో బీఎస్ఎఫ్ జవాన్లపై మూకదాడి.. ఆయుధం లాక్కునేందుకు యత్నం
త్రిపురలో బీఎస్ఎఫ్ జవాన్లపై మూకదాడి.. ఆయుధం లాక్కునేందుకు యత్నం

Tripura BSF-local clash: త్రిపురలో బీఎస్ఎఫ్ జవాన్లపై మూకదాడి.. ఆయుధం లాక్కునేందుకు యత్నం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2026
09:59 am

ఈ వార్తాకథనం ఏంటి

త్రిపురలోని సెపాహిజాలా జిల్లాలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్మగ్లింగ్‌కు సంబంధించిన వివాదం నేపథ్యంలో స్థానిక గ్రామస్థులకు, సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సిబ్బందికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో అసిస్టెంట్ కమాండెంట్ రోహిత్ కుమార్ సహా నలుగురు బీఎస్ఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. 49వ బెటాలియన్‌కు చెందిన ఆశాబారి బోర్డర్ ఔట్‌పోస్ట్ (బీఓపీ) సిబ్బందికి, స్థానిక గ్రామస్థులకు మధ్య స్మగ్లింగ్ విషయంలో వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలో హెఫ్జూర్ రెహ్మాన్ అనే గ్రామస్థుడిపై ఓ బీఎస్ఎఫ్ జవాన్ లాఠీతో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు బాక్సానగర్-రహీంపూర్ రహదారిని దిగ్బంధించారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.

వివరాలు 

బీఎస్ఎఫ్ వాహనం ధ్వంసం 

సమాచారం అందుకున్న రహీంపూర్ బీఓపీలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ కమాండెంట్ రోహిత్ కుమార్ తన బృందంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అయితే, అప్పటికే ఆగ్రహంతో ఉన్న గ్రామస్థులు ఆయన బృందంపై దాడికి దిగారు. బీఎస్ఎఫ్ వాహనాన్ని ధ్వంసం చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

అధికారి వాహనం అక్కడికి రాగానే గ్రామస్థులు వెదురు కర్రలతో దాడి చేయడం, వాహనం అద్దాలను పగలగొట్టడం అందులో కనిపించింది.

వివరాలు 

ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గాయపడిన బీఎస్ఎఫ్ సిబ్బంది

గుంపును అదుపు చేసేందుకు ప్రయత్నించిన ఓ బీఎస్ఎఫ్ జవాన్‌పై ఇద్దరువ్యక్తులు కర్రలతో కాళ్లపై దాడి చేశారు.

మరోవైపు కొందరు గ్రామస్థులు రోహిత్ కుమార్‌ను రోడ్డు పక్కకు లాక్కెళ్లి మూకదాడికి పాల్పడ్డారు.

దాడి చేసిన వారిలో ఒకరు ఆయన వద్ద ఉన్న ఆయుధాన్ని లాక్కునేందుకు ప్రయత్నించారు.

ఈ దాడిలో తల,మోకాళ్లకు తీవ్ర గాయాలవడంతో రోహిత్ కుమార్ కిందపడిపోయారు.

ఘటన గురించి తెలుసుకున్న ఉన్నతాధికారులు అదనపు బీఎస్ఎఫ్ బలగాలను అక్కడికి పంపించారు.అనంతరం గ్రామస్థులకు,భద్రతా సిబ్బందికి మధ్య మరోసారి స్వల్ప ఘర్షణ జరిగింది.

గాయపడిన బీఎస్ఎఫ్ సిబ్బందిని ప్రాథమిక చికిత్స కోసం బాక్సానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని వెల్లడించారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దాడి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్

ADVERTISEMENT