Loading...
Capex Support Scheme: క్యాపెక్స్‌ సపోర్ట్‌ స్కీమ్‌తో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు: కిషన్‌రెడ్డి
క్యాపెక్స్‌ సపోర్ట్‌ స్కీమ్‌తో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు: కిషన్‌రెడ్డి

Capex Support Scheme: క్యాపెక్స్‌ సపోర్ట్‌ స్కీమ్‌తో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు: కిషన్‌రెడ్డి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2026
09:23 am

ఈ వార్తాకథనం ఏంటి

క్యాపెక్స్‌ సపోర్ట్‌ స్కీమ్‌తో క్రిటికల్‌ మినరల్స్‌ రంగంలో రూ.10వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని కేంద్ర బొగ్గు,గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. లిథియం,నికెల్‌ వంటి కీలక ఖనిజాల ప్రాసెసింగ్‌ సామర్థ్యాన్నిపెంచేందుకు రూ.2,814కోట్లతో కేంద్రం తీసుకురానున్న ఈ పథకానికి క్యాబినెట్‌ ఆమోదం తెలపడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా క్రిటికల్‌ మినరల్స్‌ దిగుమతుల భారం తగ్గుతుందని వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పథకం కింద ఏర్పాటు చేసే ప్రాసెసింగ్‌ యూనిట్లలో ఉత్పత్తి అయ్యే ఖనిజాల విలువ ఏటా రూ.25వేల కోట్లకు చేరుతుందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ యూనిట్ల ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు స్థానికంగా అనుబంధ రంగాలు అభివృద్ధి చెందుతాయని వివరించారు.

వివరాలు 

దిగుమతులు తగ్గించడమే లక్ష్యం

అడ్వాన్స్‌డ్‌ కెమిస్ట్రీ సెల్‌ బ్యాటరీ కార్యక్రమం, క్లీన్‌ ఎనర్జీ, బ్యాటరీ స్టోరేజ్‌ లక్ష్యాలు, రేర్‌ ఎర్త్‌ పర్మనెంట్‌ మ్యాగ్నెట్‌ పథకం, ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌ వంటి కార్యక్రమాలకు అవసరమైన ముడి ఖనిజాలను అందించడంలో ఈ పథకం కీలకంగా మారుతుందని పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా లిథియం, నికెల్‌, కోబాల్ట్‌ వంటి క్రిటికల్‌ మినరల్స్‌కు భారీగా డిమాండ్‌ ఉందని కిషన్‌రెడ్డి తెలిపారు.

వీటి అవసరాల కోసం భారత్‌ దిగుమతులపై ఆధారపడుతోందని పేర్కొన్నారు.

దిగుమతులను తగ్గించడంతో పాటు క్రిటికల్‌ మినరల్స్‌ విలువ ఆధారిత సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్రం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

ఇందులో భాగంగా నేషనల్‌ క్రిటికల్‌ మినరల్స్‌ మిషన్‌ను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

వివరాలు 

నాలుగు క్రిటికల్‌ మినరల్స్‌ ప్రాసెసింగ్‌ పార్కుల ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, ఒడిశాల్లో తొలిసారిగా నాలుగు క్రిటికల్‌ మినరల్స్‌ ప్రాసెసింగ్‌ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

2017-18లో లిథియం దిగుమతుల కోసం రూ.6,500 కోట్లు ఖర్చు చేయగా, ప్రస్తుతం ఆ మొత్తం రూ.50 వేల కోట్లకు పెరిగిందని వివరించారు.

ఈ వ్యయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ కేఏబీఐఎల్‌ (ఖనిజ్‌ బిదేశ్‌ ఇండియా లిమిటెడ్‌) ద్వారా అర్జెంటీనాలో ఐదు లిథియం మైనింగ్‌ బ్లాకులను కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.

ఇప్పటివరకు తొమ్మిది కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఈ పథకం కింద 58 కంపెనీల దరఖాస్తులకు ఆమోదం లభించిందని కిషన్‌రెడ్డి తెలిపారు.

ఫలితంగా కొన్ని గనుల్లో కాడ్మియం, వెనేడియం ఉత్పత్తి ప్రారంభమైందని వెల్లడించారు.

ADVERTISEMENT