Andhra news: శ్రీసిటీలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో క్యారియర్ ప్లాంట్
ఈ వార్తాకథనం ఏంటి
హీటింగ్, వెంటిలేషన్,ఎయిర్ కండిషనింగ్ (హెచ్‌వీఏసీ) రంగంలో ముందంజలో ఉన్న క్యారియర్ ఎయిర్ కండిషనింగ్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్ సంస్థ శ్రీసిటీలో కొత్త తయారీ యూనిట్ ఏర్పాటుకు లీజ్ ఒప్పందంపై సంతకాలు చేసింది. సుమారు రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ కేంద్రం ద్వారా నేరుగా వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. అదేవిధంగా మరో రెండు వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నట్లు సంస్థ తెలిపింది. 39 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ ప్లాంట్‌లో సుస్థిరతతో పాటు ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించే కూలింగ్ పరిష్కారాల తయారీపైనే ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు.
వివరాలు
ఆటోమొబైల్ రంగాలకు కీలక కేంద్రంగా శ్రీసిటీ
ఈ ఒప్పంద పత్రాలను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సమక్షంలో క్యారియర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సుందరేశన్ నారాయణన్, శ్రీసిటీ ఎండీ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి పరస్పరం మార్పిడి చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సులభతర వ్యాపార విధానాలు, వేగవంతమైన అనుమతుల నేపథ్యంలో శ్రీసిటీ ఎయిర్ కండిషనింగ్, ఆటోమొబైల్ రంగాలకు కీలక కేంద్రంగా అభివృద్ధి చెందుతోందన్నారు. క్యారియర్ ఎండీ సుందరేశన్ నారాయణన్ మాట్లాడుతూ శ్రీసిటీలో ఉన్న ప్రపంచస్థాయి మౌలిక వసతులు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం తమ నిర్ణయానికి దోహదపడిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ల ప్రోత్సాహంతో ఈ కొత్త ప్లాంట్‌ను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.