Nisarga: సీబీఎస్‌ఈ లోపాలను బయటపెట్టిన 19 ఏళ్ల నిసర్గకు అమెరికా న్యాయ విభాగం గౌరవం
ఈ వార్తాకథనం ఏంటి
సీబీఎస్‌ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానంలోని లోపాలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన 19 ఏళ్ల నిసర్గ అధికారి మరో అరుదైన గుర్తింపు పొందాడు. అమెరికా న్యాయ విభాగం (US Department of Justice) తన సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలోని లోపాన్ని గుర్తించి నివేదించినందుకు అతడి పేరును 'హాల్ ఆఫ్ ఫేమ్'లో చేర్చింది.
వివరాలు
అమెరికా న్యాయ విభాగం వ్యవస్థలో లోపం గుర్తింపు
వారం రోజుల క్రితం యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ సిస్టమ్‌లో సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఓ కీలక లోపాన్ని గుర్తించినట్లు నిసర్గ తెలిపాడు.
సంబంధిత అధికారులకు ఆ లోపంపై నివేదిక పంపిన వెంటనే వారు స్పందించి సమస్యను పరిష్కరించినట్లు వెల్లడించాడు.
తాను అందించిన సహాయాన్ని గుర్తిస్తూ అమెరికా న్యాయ విభాగం హాల్ ఆఫ్ ఫేమ్‌లో తన పేరును చేర్చినట్లు పేర్కొన్నాడు.
అయితే భద్రతా కారణాల దృష్ట్యా తాను గుర్తించిన లోపం ఏంటి? అది ఏ సిస్టమ్‌లో ఉంది? అనే వివరాలను నిసర్గ వెల్లడించలేదు.
వివరాలు
కస్టమ్ స్క్రిప్ట్‌లతో గుర్తింపు
''యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ వెబ్‌సైట్‌ను బ్రౌజ్ చేస్తున్న సమయంలో కొన్ని కస్టమ్ స్క్రిప్ట్‌లను ఉపయోగించి ఈ లోపాన్ని గుర్తించాను. వెంటనే డీఏజీకీ (Deputy Attorney General), అమెరికా మిలిటరీకి ఈ విషయాన్ని తెలియజేశాను. అధికారులు స్పందించి సమస్యను సరిచేశారు'' అని నిసర్గ తెలిపాడు.
అంతేకాదు.. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్, యూఎస్ మిలిటరీకి సంబంధించిన కొన్ని సిస్టమ్‌లలోనూ పలు లోపాలను గుర్తించినట్లు చెప్పాడు.
వాటిని పరిష్కరించేందుకు ఆయా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని వివరించాడు.
వివరాలు
ఆరేళ్ల వయసు నుంచే కోడింగ్‌పై ఆసక్తి
నిసర్గ అధికారి ఈ ఏడాదే 12వ తరగతి పూర్తి చేశాడు. అతడి కుటుంబంలో సైబర్ సెక్యూరిటీ రంగానికి చెందిన వారు ఎవరూ లేరు.
తల్లిదండ్రులిద్దరూ ఫైనాన్స్ రంగంలో పనిచేస్తున్నారు. అయితే చిన్నప్పటి నుంచే కోడింగ్‌పై ఆసక్తి పెంచుకున్న నిసర్గ.. ఆరేళ్ల వయసు నుంచే ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం ప్రారంభించాడు.
వివరాలు
సీబీఎస్‌ఈ లోపాలను గుర్తించి..
ఇటీవల సీబీఎస్‌ఈ కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ (CBSE OSM) మూల్యాంకన పోర్టల్‌లోని కొన్ని లోపాలను నిసర్గ గుర్తించాడు.
ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ విభాగమైన సెర్ట్-ఇన్ (CERT-In) దృష్టికి తీసుకెళ్లాడు.
దీంతో అతడి పేరు జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచింది. సీబీఎస్‌ఈ వ్యవస్థలో లోపాలను గుర్తించిన యువకుడిగా వార్తల్లోకి వచ్చిన నిసర్గ.. తాజాగా అమెరికా న్యాయ విభాగం సైబర్ సెక్యూరిటీ లోపాన్ని గుర్తించి బాధ్యతాయుతంగా నివేదించడం ద్వారా మరో అంతర్జాతీయ గుర్తింపును అందుకున్నాడు.