Telangana: తెలంగాణ గ్రామాల అభివృద్ధికి కేంద్రం భారీ నిధులు.. రూ.9,968 కోట్లు మంజూరు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులు కేటాయించింది. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా 2026-27 నుంచి 2030-31 వరకు ఐదేళ్ల కాలానికి రాష్ట్రానికి రూ.9,968 కోట్ల గ్రాంట్‌ను ప్రకటించింది. ఈ నిధులను పూర్తిగా గ్రామాల అభివృద్ధి పనులకే వినియోగించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు వంటి ఖర్చులకు ఈ మొత్తాన్నిఉపయోగించరాదని కఠిన ఆదేశాలు జారీ చేసింది. గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్‌లు, జిల్లా ప్రజా పరిషత్‌ల పరిధిలో తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, గ్రామీణ రహదారుల అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు వంటి ప్రజా అవసరాల పనులకే ఈ నిధులు ఖర్చు చేయాలని పేర్కొంది.
వివరాలు
నిధుల ఖర్చులో పారదర్శకత, కఠిన పర్యవేక్షణకు మార్గదర్శకాల జారీ
నిధుల వినియోగంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పటిష్ఠ పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయనుంది. ప్రతి స్థానిక సంస్థ ఖర్చుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. త్రైమాసిక,వార్షిక నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలి. రాష్ట్ర ప్రభుత్వం వాటిని కేంద్రానికి సమర్పించాల్సి ఉంటుంది. ఆడిట్‌లో లోపాలు బయటపడితే వెంటనే సరిదిద్దాలని, అక్రమాలు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాల గ్రామీణ స్థానిక సంస్థల కోసం మొత్తం రూ.4,35,236 కోట్లను ఆర్థిక సంఘం కేటాయించింది. ఇందులో 80 శాతం నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు,10 శాతం మండల ప్రజా పరిషత్‌లకు, మరో 10 శాతం జిల్లా ప్రజా పరిషత్‌లకు విడుదల చేస్తారు.
వివరాలు
80% నిధులు పంచాయతీలకు.. 20% మండల, జిల్లా పరిషత్‌లకు పంపిణీ
ప్రతి సంవత్సరం జూన్, అక్టోబర్ నెలల్లో రెండు విడతలుగా ఈ నిధులను అందజేయనున్నారు. అయితే మొత్తం నిధుల్లో 20శాతం భాగం స్థానిక సంస్థల పనితీరు ఆధారంగా విడుదల అవుతుంది. పన్నుల వసూళ్లు,స్వంత ఆదాయ వనరుల పెంపు వంటి అంశాలను ప్రామాణికంగా పరిగణిస్తారు. కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పది పనిదినాల్లోగా స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. మొదటి విడత నిధులు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ వివరాలు,2025-26 ఆడిట్ నివేదికలను సమర్పించాలి. ఎన్నికలు పూర్తై ప్రజాప్రతినిధులు ఉన్న స్థానిక సంస్థలకే ఈ గ్రాంట్లు వర్తిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే నిధుల వినియోగంపై గ్రామసభలు,పరిషత్ సమావేశాల్లో తీర్మానాలు ఆమోదించి,వాటిని ఇ-గ్రామ్‌స్వరాజ్ వేదికలో నమోదు చేయడం తప్పనిసరి చేసింది.