AP: ఏపీలో 123 పురపాలికల్లోనూ ఎన్నికలు.. పురపాలక మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులకు సీఎం ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లోని 123 పురపాలక సంస్థలు, నగరపాలక సంస్థలు,నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయిన 23పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అడ్డంకులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే డివిజన్లు, వార్డుల పునర్విభజన ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రధానంగా పుర ఎన్నికల నిర్వహణ,పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, కొత్త అభివృద్ధి పనులపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో పుర ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని సీఎం ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమగ్రంగా సమీక్షించారు.
వివరాలు
ఎన్నికలకు అడ్డంకిగా ఉన్న కోర్టు కేసులు.. పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు
ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి నారాయణతో పాటు శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సన్నాహాలు, కొన్ని పురపాలక సంఘాల్లో ఎన్నికలకు అడ్డంకిగా ఉన్న కోర్టు కేసుల స్థితిగతులు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై వారు సీఎంకు వివరాలు సమర్పించారు.
గతంలో 2021లో రెండు దశల్లో 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించగా, కోర్టు వివాదాల కారణంగా 23 ప్రాంతాల్లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయలేకపోయారు.
ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న ఆ కేసులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
సమీక్షలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్, కమిషనర్ సంపత్‌కుమార్‌లకు కోర్టు కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు.
వివరాలు
రూ.18 వేల కోట్ల పట్టణాభివృద్ధి పనులకు ఆమోదం
అలాగే కోర్టు వివాదాల కారణంగా నిలిచిపోయిన డివిజన్లు, వార్డుల పునర్విభజన ప్రక్రియను కూడా వేగవంతం చేసి పూర్తిచేయాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టనున్న రూ.18 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు.
ఈ నిధులతో తాగునీటి సరఫరా, రహదారుల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, పార్కుల అభివృద్ధి, ఇతర మౌలిక వసతుల కల్పన వంటి పనులు చేపట్టనున్నారు.
ఈ ప్రాజెక్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50 శాతం చొప్పున నిధులు సమకూర్చనున్నాయి.
అభివృద్ధి పనులకు వెంటనే టెండర్లు పిలిచి, రెండేళ్లలో పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.