Stock market new rules 2026: ఎన్‌ఎస్‌ఈ ప్రీ-ఓపెన్ సెషన్‌లో కీలక మార్పులు.. నేటి నుంచే కొత్త నిబంధనలు అమలు
ఈ వార్తాకథనం ఏంటి
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు, ట్రేడర్లకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) కీలక మార్పులను తీసుకొచ్చింది. ప్రీ-ఓపెన్ సెషన్‌కు సంబంధించి సవరించిన నిబంధనలు సెప్టెంబరు 7 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే మార్కెట్ ప్రారంభమయ్యే సమయాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ప్రీ-ఓపెన్ సమయంలో ఆర్డర్లను నమోదు చేయడం, మార్చడం, రద్దు చేయడంలో మాత్రం కొత్త విధానం అమలులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్‌లో పారదర్శకతను మరింత పెంచడం, క్యాష్, డెరివేటివ్స్ విభాగాల మధ్య మెరుగైన సమన్వయం తీసుకురావడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం.
వివరాలు
ప్రీ-ఓపెన్‌లో నాలుగు దశలు
ఎన్‌ఎస్‌ఈలో ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి 9:15 గంటల వరకు 15నిమిషాల పాటు ప్రీ-ఓపెన్ సెషన్ కొనసాగుతుంది. ఈ సమయాన్ని ఇకపై నాలుగు ప్రత్యేక దశలుగా విభజించారు.
ఉదయం 9:00 నుంచి 9:05 వరకు.. తొలి దశ: మొదటి ఐదు నిమిషాల్లో ఇన్వెస్టర్లు లిమిట్ ఆర్డర్లతో పాటు మార్కెట్ ఆర్డర్లను కూడా నమోదు చేయవచ్చు.ఇప్పటికే పెట్టిన ఆర్డర్లలో అవసరమైన మార్పులు చేయడం లేదా వాటిని రద్దు చేసుకోవడం కూడా ఈ సమయంలో అనుమతిస్తారు.
ఉదయం 9:05 నుంచి 9:10 వరకు..రెండో దశ: తర్వాతి ఐదు నిమిషాల్లో కేవలం లిమిట్ ఆర్డర్లకు మాత్రమే అవకాశం ఉంటుంది.ఈ సమయంలో కొత్త లిమిట్ ఆర్డర్లు పెట్టడం,ఇప్పటికే ఉన్న వాటిని మార్చడం లేదా రద్దు చేయడం చేసుకోవచ్చు.
వివరాలు
ఉదయం 9:10 నుంచి 9:12 వరకు.. మూడో దశ
మార్కెట్ ఆర్డర్ల విషయంలో మాత్రం పరిమితులు ఉంటాయి.
ఈ రెండు నిమిషాల్లో ఆర్డర్ల మ్యాచింగ్, ట్రేడ్ల నిర్ధారణ వంటి ప్రక్రియలు పూర్తవుతాయి.
ఇదే సమయంలో ఆయా కంపెనీల ప్రారంభ ధర (Opening Price) కూడా నిర్ణయిస్తారు.
గతంలో ఈ ప్రక్రియకు 9:08 నుంచి 9:12 గంటల వరకు సమయం ఉండేది. ఇప్పుడు దీనిని 9:10 నుంచి 9:12 గంటలకు మార్చారు.
ఉదయం 9:12 నుంచి 9:15 వరకు.. నాలుగో దశ
ఇది బఫర్ పీరియడ్‌గా ఉంటుంది. ప్రీ-ఓపెన్ సెషన్ ముగిసిన తర్వాత సాధారణ ట్రేడింగ్ ప్రారంభానికి మధ్య ఉండే ఈ మూడు నిమిషాల సమయం మార్పిడికి సన్నాహాలు చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఉదయం 9:15 గంటలకు సాధారణ ట్రేడింగ్ యథావిధిగా ప్రారంభమవుతుంది.
వివరాలు
ఏయే సెక్యూరిటీలకు వర్తిస్తాయి?
ఎన్‌ఎస్‌ఈ తీసుకొచ్చిన ఈ మార్పులు కేవలం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌ఓ) ట్రేడర్లకే పరిమితం కావు.
క్యాష్ లేదా ఈక్విటీ మార్కెట్‌లోని విస్తృత శ్రేణి సెక్యూరిటీల ప్రీ-ఓపెన్ సెషన్‌కు ఇవి వర్తిస్తాయి.
మెయిన్ బోర్డులో నమోదైన లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ కంపెనీలతో పాటు ఎస్‌ఎంఈ షేర్లు, పాక్షికంగా చెల్లించిన షేర్లు (Partially Paid-up Shares), రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టులు (REITs), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టులు (InvITs) తదితర ఈక్విటీ సెక్యూరిటీలకు కూడా కొత్త నిబంధనలు వర్తిస్తాయి.
వివరాలు
సెబీ నిర్ణయాలకు అనుగుణంగానే సవరణలు
భారత సెక్యూరిటీస్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆగస్టు 4న ఈక్విటీ క్యాష్ మార్కెట్‌లో క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (CAS) విధానాన్ని ప్రవేశపెట్టింది.
మార్కెట్ ముగిసే సమయంలో షేర్ల ముగింపు ధరలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్ణయించడమే ఈ విధానం ఉద్దేశం.
మార్కెట్ ప్రారంభ సమయంలోనూ ఇదే తరహాలో పారదర్శకమైన ధరల నిర్ధారణ (Price Discovery) జరగాలనే ఉద్దేశంతో ఎన్‌ఎస్‌ఈ ప్రీ-ఓపెన్ విధానాన్ని సవరించింది.
వివరాలు
సెబీ నిర్ణయాలకు అనుగుణంగానే సవరణలు
దీంతో మార్కెట్ ప్రారంభంలో చోటుచేసుకునే తీవ్రమైన ధరల హెచ్చుతగ్గులను తగ్గించడంతో పాటు, ఇన్వెస్టర్లు మరింత సరైన ధరల వద్ద లావాదేవీలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
ఉదయం మార్కెట్ ప్రారంభానికి ముందే ఆర్డర్లు నమోదు చేసే ఇన్వెస్టర్లు, ట్రేడర్లు కొత్త సమయ విభజనను తప్పనిసరిగా గమనించాలి.
ముఖ్యంగా మార్కెట్ ఆర్డర్లు, లిమిట్ ఆర్డర్లకు సంబంధించిన మార్పులను పరిగణనలోకి తీసుకుని తమ ట్రేడింగ్ వ్యూహాలను రూపొందించుకోవడం మంచిది.