Womens Asia Cup: 55 పరుగులకే కుప్పకూలిన దాయాది.. ఆసియా కప్ లీగ్ దశలో భారత్ అజేయం
ఈ వార్తాకథనం ఏంటి
అనుకున్నట్లుగానే పాకిస్థాన్‌పై టీమిండియా మరోసారి ఆధిపత్యం చాటింది. ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్న భారత స్పిన్నర్లు మరోసారి విజృంభించారు. తెలుగమ్మాయి శ్రీ చరణి అద్భుత బౌలింగ్‌తో పాక్ బ్యాటింగ్ వెన్నువిరిచింది. దీంతో పాకిస్థాన్ కేవలం 55 పరుగులకే ఆలౌటైంది. అయితే స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు కూడా తడబడింది. 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ.. చివరికి 8.4 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. మహిళల క్రికెట్‌లో పాకిస్థాన్‌పై ఎన్నో ఏళ్లుగా తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తున్న భారత జట్టు.. ఆసియా కప్‌లోనూ అదే జోరును కొనసాగించింది. శనివారం గ్రూప్-ఎలో జరిగిన చివరి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది.
వివరాలు
18.1 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలిన పాక్..
'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' శ్రీ చరణి 4 ఓవర్లలో కేవలం 7 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది.
ఆమెతో పాటు ప్రేమ రావత్ 4 ఓవర్లలో 9 పరుగులిచ్చి 3 వికెట్లు, దీప్తి శర్మ 3.1 ఓవర్లలో 5 పరుగులిచ్చి 2 వికెట్లు తీయడంతో పాక్ 18.1 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది.
పాకిస్థాన్ జట్టులో ఓపెనర్లు మునీబా అలీ (13), షవాల్ జుల్ఫికర్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
మిగతా బ్యాటర్లు భారత బౌలర్లను ఎదుర్కోలేకపోయారు. అనంతరం 56 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కూడా ఆరంభంలో ఇబ్బందులు ఎదుర్కొంది.
వివరాలు
చివరి మ్యాచ్‌లో హాంకాంగ్‌తో ఢీ..
పాక్ కెప్టెన్ ఫాతిమా సనా 3 వికెట్లు తీయడంతో 29 పరుగులకే టీమ్‌ఇండియా మూడు వికెట్లు కోల్పోయింది.
అయితే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (18 నాటౌట్), దీప్తి శర్మ (12 నాటౌట్) కలిసి జట్టును విజయతీరాలకు చేర్చారు.
ఈ విజయంతో గ్రూప్-ఎ లీగ్ దశను భారత్ అజేయంగా ముగించింది.
ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకున్న టీమ్‌ఇండియా.. ఇప్పుడు నాకౌట్ దశపై దృష్టి పెట్టనుంది.
గ్రూప్-ఎలో రెండో సెమీఫైనల్ బెర్తు కోసం పాకిస్థాన్, థాయ్‌లాండ్, హాంకాంగ్ పోటీపడుతున్నాయి.
తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌ను ఓడించిన పాకిస్థాన్.. తన చివరి మ్యాచ్‌లో హాంకాంగ్‌పై విజయం సాధించకపోతే తదుపరి దశకు చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి.