Andhra Pradesh: చిన్న పరిశ్రమలకు భారీ బూస్ట్.. ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండింగ్!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక గుర్తింపు ఉన్న స్థానిక ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది. కొండపల్లి బొమ్మలు, మంగళగిరి చేనేత చీరలు, చీమకుర్తి బ్లాక్ గెలాక్సీ గ్రానైట్, అరకు కాఫీ, రాయదుర్గం జీన్ ప్యాంట్లు, అజ్జరం ఇత్తడి వస్తువులు, పెడన కలంకారీ, ఏటికొప్పాక కొయ్యబొమ్మలు, పలాస జీడిపప్పు వంటి ప్రత్యేకత కలిగిన ఉత్పత్తులను గుర్తించింది. ఇలాంటి 80కి పైగా ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండింగ్ కల్పించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతోంది. ఈ ఉత్పత్తుల తయారీలో ఆధునిక సాంకేతికతను జోడించి నాణ్యతను మెరుగుపరచడంతో పాటు, ప్రపంచ మార్కెట్‌కు అనుగుణంగా వాటిని తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది.
వివరాలు
1,840 ఎంఎస్‌ఎంఈలకు ప్రయోజనం
ఇందులో భాగంగా 45 కామన్ ఫెసిలిటీ సెంటర్లు (సీఎఫ్‌సీలు) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
వీటి ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈలు) అవసరమైన సాంకేతికత, మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానుంది.
45 సీఎఫ్‌సీల ద్వారా సుమారు 1,840 ఎంఎస్‌ఎంఈలకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సీఎఫ్‌సీల ఏర్పాటుకు అయ్యే వ్యయంలో 70 శాతం నుంచి 90 శాతం వరకు ప్రభుత్వమే గ్రాంటుగా అందించనుంది.
ఇందుకోసం ఐదేళ్లలో సుమారు రూ.200 కోట్లు ఖర్చు చేయాలని ప్రణాళిక రూపొందించింది.
ఒకే తరహా ఉత్పత్తులను తయారు చేస్తున్న చిన్న పరిశ్రమలు ప్రస్తుతం తమ ఉత్పత్తులను వేర్వేరుగా విక్రయిస్తున్నాయి. ఇలాంటి సంస్థలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం క్లస్టర్ విధానాన్ని అమలు చేయనుంది.
వివరాలు
చిన్న పరిశ్రమలకు అందుబాటులోకి ఆధునిక సాంకేతికత
30 కిలోమీటర్ల పరిధిలోని పరిశ్రమలను గుర్తించి, కనీసం 10 కంపెనీలను ఒక క్లస్టర్ పరిధిలోకి** తీసుకొచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది.
తయారీ రంగంలో అందుబాటులోకి వస్తున్న కొత్త సాంకేతికతను చిన్న పరిశ్రమలకు తక్కువ ఖర్చుతో అందించడమే సీఎఫ్‌సీల ప్రధాన ఉద్దేశం.
వీటిలో ప్రత్యేక పరీక్ష కేంద్రాలు, శిక్షణ సదుపాయాలు, ముడిసరుకు డిపోలు, డిజైన్ సెంటర్లు, వ్యర్థజలాల శుద్ధి యూనిట్లు, ప్లగ్ అండ్ ప్లే సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు.
చిన్న పరిశ్రమలు నామమాత్రపు సర్వీసు ఛార్జీ చెల్లించి ఈ సదుపాయాలను వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
వివరాలు
20.77 లక్షల ఎంఎస్‌ఎంఈల రిజిస్ట్రేషన్
రాష్ట్రంలో 20.77 లక్షల ఎంఎస్‌ఎంఈలు ఉద్యమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి.
వీటిలో తయారీ రంగానికి చెందినవి 24.2 శాతం, సర్వీస్ సెక్టార్‌కు చెందినవి 48.3 శాతం, వాణిజ్య రంగానికి చెందినవి 27.5 శాతంగా ఉన్నాయి.
అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్, బంగారు ఆభరణాల తయారీ, టెక్స్‌టైల్, హౌస్‌హోల్డ్ ఉత్పత్తులు, పేపర్ అండ్ పేపర్‌బోర్డు ఉత్పత్తులు, కెమికల్స్, కాయిర్ ఉత్పత్తుల రంగాల్లోని ప్రముఖ తయారీ పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపైనా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది.
వివరాలు
తక్కువ ధరకే ముడిసరుకు.. పెరగనున్న లాభాలు
సీఎఫ్‌సీల ఏర్పాటుతో చిన్న పరిశ్రమలకు అవసరమైన ముడిపదార్థాలు ఒకే చోట తక్కువ ఖర్చుతో అందుబాటులోకి రానున్నాయి.
ఉత్పత్తుల నాణ్యతను పెంచడం, కొత్త ఉత్పత్తి విధానాలను ప్రవేశపెట్టడం, విలువ జోడించడం ద్వారా తయారీదారులు తమ ఉత్పత్తులను మెరుగైన లాభాలకు విక్రయించుకునే అవకాశం ఏర్పడుతుంది.
అంతేకాకుండా ప్రపంచ పర్యావరణ లక్ష్యాలకు అనుగుణంగా హరిత సాంకేతికతలు, సుస్థిర తయారీ విధానాలను ప్రోత్సహించేందుకు కూడా ఈ సీఎఫ్‌సీలు దోహదపడనున్నాయి.
మొత్తంగా స్థానికంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించి, వాటిని గ్లోబల్ మార్కెట్‌లోకి తీసుకెళ్లడంతో పాటు రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.