Loading...
Swarna Bharat Trust: గ్రామీణ జీవితాల్లో 'స్వర్ణ' కాంతులు.. 25 ఏళ్లుగా సేవా ప్రస్థానం
గ్రామీణ జీవితాల్లో 'స్వర్ణ' కాంతులు.. 25 ఏళ్లుగా సేవా ప్రస్థానం

Swarna Bharat Trust: గ్రామీణ జీవితాల్లో 'స్వర్ణ' కాంతులు.. 25 ఏళ్లుగా సేవా ప్రస్థానం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 06, 2026
08:58 am

ఈ వార్తాకథనం ఏంటి

గ్రామీణ సాధికారత, వికాసం, ఆత్మనిర్భరత లక్ష్యాలుగా.. సేవను పరమావధిగా చేసుకుని ముందుకు సాగుతున్న స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ 25 వసంతాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడి మానస పుత్రికగా 2001లో ఆవిర్భవించిన ఈ సంస్థ.. పాతికేళ్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో లక్షలాది మంది పేదలు, మహిళలు, రైతులు, గ్రామీణ యువత జీవితాల్లో మార్పునకు బాటలు వేసింది. విద్యార్థులు, యువతకు నైపుణ్య శిక్షణ అందించడం, గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాల కోసం శిక్షణ ఇవ్వడం, పేదలకు ఉచిత విద్య, వైద్య సేవలు అందించేందుకు కృషి చేయడం వంటి లక్ష్యాలను ట్రస్ట్‌ నిరంతరం కొనసాగిస్తోంది. సంస్థ రజతోత్సవ కార్యక్రమాన్ని వెంకటాచలంలో సోమవారం నిర్వహించనున్నారు.

వివరాలు

మాతృభూమికి సేవ చేయాలనే సంకల్పంతో..

వెంకయ్యనాయుడు అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.

మాతృభూమికి సేవ చేయాలనే సంకల్పంతో వెంకయ్యనాయుడి స్ఫూర్తితో ఆయన ఎనిమిది మంది మిత్రులు కలిసి స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ను ప్రారంభించారు.

నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ప్రారంభమైన ఈ సంస్థ సేవలు క్రమంగా అనేక రంగాలకు విస్తరించాయి.

విజయవాడ సమీపంలోని ఆత్కూరు, హైదరాబాద్‌లోని ముచ్చింతల్‌లోనూ ట్రస్ట్‌ శాఖలను ఏర్పాటు చేసి విస్తృతంగా శిక్షణ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ.. ప్రభుత్వాల నుంచి సాయం, నిధులను ఆశించకుండా ట్రస్ట్‌ కార్యకలాపాలను కొనసాగిస్తోంది.

భావసారూప్యం, సేవాతత్పరత కలిగిన వ్యక్తులు, సంస్థల భాగస్వామ్యం, సహకారంతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

వివరాలు

వెంకటాచలంలో విస్తృత సేవలు

వెంకటాచలంలో స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ అనేక రంగాల్లో సేవలను అందిస్తోంది.

సీబీఎస్‌ఈ సిలబస్‌తో అక్షర విద్యాలయం పేరుతో పాఠశాలను నిర్వహిస్తోంది.

రైతులు, అల్పాదాయ వర్గాలకు చెందిన పిల్లల కోసం స్టేట్‌ సిలబస్‌తో స్వర్ణభారతి విద్యా మందిర్‌ ను నిర్వహిస్తోంది.

పదో తరగతిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందిస్తోంది.

గ్రామీణ ఆరోగ్య కేంద్రం, కంటి ఆసుపత్రి, పశువైద్యశాలను నిర్వహిస్తోంది.

దంత వైద్య సేవలను కూడా అందిస్తోంది.

25 ఏళ్లుగా ప్రతి నెలా వైద్య శిబిరాలను నిర్వహిస్తోంది.

దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను అందిస్తోంది.

గ్రహణ మొర్రి సమస్యతో బాధపడుతున్న పిల్లలకు శస్త్రచికిత్సలు చేయిస్తోంది.

బడి మానేసిన, అనాథ పిల్లలను చేరదీసి బ్రిడ్జి స్కూల్‌ లో విద్యాబోధన చేస్తోంది.

ADVERTISEMENT

వివరాలు

ఫ్యాషన్‌ డిజైనింగ్‌ వంటి కోర్సుల్లో శిక్షణ

గ్రామీణ యువతకు సెల్‌ఫోన్లు, టీవీలు, ఏసీల మరమ్మతులతో పాటు టైలరింగ్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ వంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తోంది.

స్వర్ణభారత్‌-సోమా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ట్రైనింగ్‌, సైబర్‌ గ్రామీణ, స్వశక్తి వంటి సంస్థల ద్వారా సాంకేతిక, ఐటీ రంగాల్లోనూ నైపుణ్య శిక్షణ అందిస్తోంది.

ఆధునిక వ్యవసాయ పద్ధతులు, స్వయం ఉపాధి కార్యక్రమాలపై మహిళలకు ఉచిత శిక్షణ ఇస్తోంది.

బొల్లినేని ఫౌండేషన్‌తో కలిసి వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తోంది.

తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం పండుగలు, ఉత్సవాలను నిర్వహిస్తోంది.

కొవిడ్‌ సమయంలో భారత్‌ బయోటెక్‌ వంటి సంస్థల సహకారంతో 5 వేల మందికి రెండు డోసుల వ్యాక్సిన్లను అందించింది.

ADVERTISEMENT

వివరాలు

విజయవాడ చాప్టర్‌లోనూ సేవా కార్యక్రమాలు

విజయవాడ చాప్టర్‌ ద్వారా అబ్దుల్‌ కలాం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (ప్రతిభ), స్వశక్తి, సైబర్‌ గ్రామీణ్‌, రైతుల శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తున్నారు.

కామినేని ఆసుపత్రితో కలిసి 12 పడకల అత్యవసర చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. రైతుల కోసం శిక్షణ, అవగాహన కేంద్రాలను నిర్వహిస్తున్నారు.

డా. బీవీ రాజు ఫౌండేషన్‌తో కలిసి కృష్ణా జిల్లాలోని జడ్పీ పాఠశాలల్లో ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. అలాగే నేత్ర, దంత పరీక్షల కేంద్రాలను కూడా నిర్వహిస్తున్నారు.

వివరాలు

హైదరాబాద్‌ చాప్టర్‌ ద్వారా నైపుణ్య శిక్షణ

హైదరాబాద్‌ చాప్టర్‌లో ఎస్‌ఈడబ్ల్యూ ఫౌండేషన్‌తో కలిసి స్వశక్తి పేరుతో ఒకేషనల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు.

వీటితో పాటు ఫార్మా పాఠశాల, అటల్‌జీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ ఒకేషనల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, స్మార్ట్‌ సిటీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కంప్యూటర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వంటి సంస్థలను కూడా నిర్వహిస్తోంది.

వివరాలు

ట్రస్ట్‌ను సందర్శించిన పలువురు ప్రముఖులు

స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ సేవలను పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ట్రస్ట్‌ను సందర్శించి.. గ్రామీణ భారత వికాసానికి సంస్థ అందిస్తున్న సేవలపై హర్షం వ్యక్తం చేశారు.

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే ఆడ్వాణీ, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ట్రస్ట్‌ను సందర్శించారు.

ఇక వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్‌. స్వామినాథన్‌, మునిరత్నం నాయుడు, ఆర్‌. పరాశరన్‌ వంటి ప్రముఖులకు వివిధ రంగాల్లో సేవలకు గుర్తింపుగా వెంకయ్యనాయుడు పేరుతో నేషనల్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డులను కూడా సంస్థ అందజేసింది.

వివరాలు

గ్రామీణ సాధికారతే ప్రధాన ఆశయం

గ్రామీణ భారత సాధికారత, ఆత్మనిర్భరతే తమ ప్రధాన ఆశయాలని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ దీపా వెంకట్‌ తెలిపారు. ప్రభుత్వాల నుంచి ఆర్థిక సహకారం ఆశించకుండా 'అంత్యోదయ' సిద్ధాంతంతో సంస్థ ముందుకు సాగుతోందన్నారు.

వెంకయ్యనాయుడి మార్గాన్ని విశ్వసించిన శ్రేయోభిలాషులు, ట్రస్ట్‌ ఆశయాల్లో భాగస్వాములైన వివిధ సంస్థలు, సహకరిస్తున్న దాతలు, రేయింబవళ్లు శ్రమిస్తున్న వాలంటీర్లు, వెన్నంటి నిలుస్తున్న ఆత్మీయుల సహకారంతోనే ఈ సేవా యజ్ఞం విజయవంతంగా కొనసాగుతోందని పేర్కొన్నారు.

25 ఏళ్లుగా సాగుతున్న స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ప్రస్థానాన్ని సమాజానికే అంకితం చేస్తున్నామని దీపా వెంకట్‌ స్పష్టం చేశారు.

ADVERTISEMENT