Telangana: కాంగ్రెస్‌లో క్రమశిక్షణ చర్యలు.. తొమ్మిది మంది నేతలకు షోకాజ్ నోటీసులు
ఈ వార్తాకథనం ఏంటి
తొమ్మిది మంది కాంగ్రెస్ నాయకులకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తమపై వచ్చిన ఫిర్యాదులపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్, ఎంపీ మల్లు రవి అధ్యక్షతన ఆదివారం గాంధీభవన్‌లో సమావేశం నిర్వహించారు. ఇందిరాభవన్‌లో పీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన ఆ విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కూడా మల్లు రవి హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ క్రమశిక్షణ కమిటీ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.
వివరాలు
పరస్పర ఫిర్యాదులతో ఇద్దరు నేతలకు..
ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి కంది శ్రీనివాస్‌రెడ్డి, సంజీవరెడ్డి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారని మల్లు రవి తెలిపారు.
ఈ నేపథ్యంలో ఇద్దరికీ షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. అలాగే గజ్వేల్ నర్సారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు రావడంతో జూపల్లి మల్లారెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు వివరించారు.
నర్సారెడ్డిపై పలువురు ఫిర్యాదు చేయడంతో ఆయనకు కూడా షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు మల్లు రవి పేర్కొన్నారు.
ఈ అంశాలపై సంబంధిత నేతలు తమ వివరణను నిర్ణీత గడువులోగా సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.
వివరాలు
ఎంపీ వంశీ కారుపై దాడి ఫిర్యాదు
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కారుపై దాడి జరిగిందంటూ వచ్చిన ఫిర్యాదుపైనా క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంది.
ఈ వ్యవహారంలో గడ్డం త్రిమూర్తి, అక్క వెంకటేశ్వర్లు, అంకట శ్రీనివాస్, ముత్యాల శ్రీనివాస్‌సృజన్, ఆకుల ప్రసాద్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు మల్లు రవి వెల్లడించారు.