Loading...
AP Reservoirs: ఏపీలో 130 రిజర్వాయర్ల వద్ద పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులపై అధ్యయనం
ఏపీలో 130 రిజర్వాయర్ల వద్ద పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులపై అధ్యయనం

AP Reservoirs: ఏపీలో 130 రిజర్వాయర్ల వద్ద పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులపై అధ్యయనం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 14, 2026
10:02 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లోని 130 రిజర్వాయర్ల వద్ద పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత్‌ ప్రాజెక్టులు (పీఎస్‌పీ) ఏర్పాటు చేసే అవకాశాలపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలతో పాటు ఎకనమిక్‌ ఫీజిబిలిటీని కూడా పరిశీలించాలని సూచించారు. పోలవరం వద్ద పీఎస్‌పీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వచ్చిన నేపథ్యంలో సీఎం ఈ ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో గురువారం విద్యుత్‌శాఖపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి ఆరేళ్లకు విద్యుత్‌ వినియోగం రెట్టింపు అవుతోందని తెలిపారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

వివరాలు 

సౌర విద్యుత్‌ ఉత్పత్తిని పెంచాలని చంద్రబాబు ఆదేశం 

విద్యుత్‌ పంపిణీలో జరుగుతున్న నష్టాలను మరింత తగ్గించే చర్యలు చేపట్టాలని, వినియోగదారులకు తక్కువ ధరకు విద్యుత్‌ అందేలా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున జల విద్యుత్‌ ఉత్పత్తి ఆశించిన స్థాయిలో జరగకపోవచ్చని సీఎం పేర్కొన్నారు.

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

సౌర విద్యుత్‌ ఉత్పత్తిని సాధ్యమైనంత మేర పెంచాలని చంద్రబాబు ఆదేశించారు.

పీఎం సూర్యఘర్‌ పథకం కింద సెప్టెంబరు నాటికి 6 లక్షల సోలార్‌ యూనిట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

మరో 3 లక్షల కనెక్షన్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

వివరాలు 

మినీ సోలార్‌ యూనిట్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలనీ సీఎం సూచన

అదేవిధంగా మరో 10 లక్షల కనెక్షన్లకు రూఫ్‌టాప్‌ సోలార్‌ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేయాలని ఆదేశించారు.

పీఎం కుసుమ్‌ పథకం కింద ఫీడర్ల సమీపంలో మినీ సోలార్‌ యూనిట్ల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం సూచించారు.

అదనంగా మరో 2,000 మెగావాట్ల విద్యుత్‌ కేటాయించేలా కేంద్రాన్ని కోరాలని చెప్పారు.

ఈ ఏడాది విద్యుత్‌ కొనుగోలు వ్యయాన్ని యూనిట్‌కు రూ.4.60కు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ADVERTISEMENT

వివరాలు 

విద్యుత్‌ సంస్థలకూ రేటింగ్

రాష్ట్రంలోని విద్యుత్‌ సంస్థల పనితీరును అంచనా వేసేందుకు పనితీరు ఆధారిత రేటింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని చంద్రబాబు సూచించారు.

విద్యుత్‌ సంస్థలపై ఉన్న రుణభారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఆర్థిక సంస్థలతో చర్చించి రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

విద్యుత్‌ సంస్థల్లో డిజిటల్‌ ట్విన్‌ వ్యవస్థ, అసెట్‌ హెల్త్‌ ఇండెక్స్‌ విధానాలను అమలు చేస్తున్న అధికారులను సీఎం అభినందించారు.

ఈ సాంకేతిక విధానాల ద్వారా సంస్థల ఆస్తుల పనితీరును మెరుగ్గా పర్యవేక్షించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

ఆర్టీజీఎస్‌తో కలిసి సమగ్ర సిటిజన్‌ డేటాబేస్

రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేరేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

పేదల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌)తో కలిసి సమగ్రమైన సిటిజన్‌ డేటాబేస్‌ను రూపొందించాలని ఐఐటీ కాన్పుర్‌ ప్రతినిధులను కోరారు.

సచివాలయంలో గురువారం ఐఐటీ కాన్పుర్‌ ప్రతినిధులు చంద్రబాబుతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కుటుంబ సాధికారత మిషన్‌పై వారితో సీఎం చర్చించారు. అర్హత ఉన్న కుటుంబాలను గుర్తించి వారికి అవసరమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థంగా అందించేందుకు సమగ్ర పౌర డేటాబేస్‌ ఉపయోగపడేలా రూపొందించాలని సూచించారు.

ఈ సమీక్ష సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ తదితరులు పాల్గొన్నారు.

ADVERTISEMENT