US: ఇరాన్‌పై అమెరికా మరో పిడుగు.. హర్ముజ్‌లో నిరవధిక బ్లాకేడ్‌కు సిద్ధం!
ఈ వార్తాకథనం ఏంటి
తమ డిమాండ్లు, షరతుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని ఇరాన్ స్పష్టం చేసింది. అవసరమైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవిలో ఉన్నంతకాలం యుద్ధం కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో అమెరికా తన ఒత్తిడిని మరింత పెంచుతోంది. హర్ముజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందని ట్రంప్ పదేపదే ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాంతంలో మరింత దూకుడుగా వ్యవహరించేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. హర్ముజ్ జలసంధిలో ఇప్పటికే నౌకా దిగ్బంధాన్ని కొనసాగిస్తున్న అమెరికా సైన్యం.. అవసరమైతే దీనిని నిరవధికంగా కొనసాగించాలని భావిస్తున్నట్లు సమాచారం. అంటే నిర్దిష్ట కాలపరిమితి లేకుండా ఇరాన్ పోర్టులకు రాకపోకలు సాగించే నౌకలపై నిఘా కొనసాగించడం, అవసరమైతే వాటిపై చర్యలు తీసుకోవడం అన్నమాట.
వివరాలు
ఇరాన్‌పై మరిన్ని ఆర్థిక ఆంక్షలు
కాల్పుల విరమణపై చర్చలు నిలిచిపోవడం, ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ మాట్లాడుతూ.. హర్ముజ్ ప్రాంతంలో తమ నౌకాదళాన్ని కొనసాగించే సామర్థ్యం అమెరికాకు ఉందని తెలిపారు.
అవసరాన్ని బట్టి యుద్ధ నౌకలను మారుస్తూ ఆ ప్రాంతంలో పహారా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
నౌకా దిగ్బంధంతో పాటు ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని కూడా మరింత పెంచనున్నట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ప్రకటించారు.
గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఆంక్షలు విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఇరాన్‌ను తిరిగి చర్చల బల్లపైకి తీసుకురావడమే అమెరికా ప్రధాన లక్ష్యమని వాషింగ్టన్ వర్గాలు చెబుతున్నాయి.
వివరాలు
హర్ముజ్ జలసంధే కీలక కేంద్రం
అయితే ఇప్పటివరకు విధించిన ఆంక్షలు, కొనసాగించిన ఒత్తిడి ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి.
అణు ఒప్పందం నేపథ్యంలో మొదలైన పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రధానంగా హర్ముజ్ జలసంధి చుట్టూ కేంద్రీకృతమయ్యాయి.
ప్రపంచ చమురు, ఎల్‌ఎన్‌జీ రవాణాకు ఈ మార్గం అత్యంత కీలకమైనది.
యుద్ధం ప్రారంభానికి ముందు ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో దాదాపు ఐదో వంతు ఈ జలసంధి ద్వారానే జరిగేది.
తమపై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ ఈ వ్యూహాత్మక జలమార్గంపై నియంత్రణ సాధించేందుకు ప్రయత్నిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది.
మరోవైపు హర్ముజ్ తమ ఆధీనంలోనే ఉందని ఇరాన్ చెబుతోంది. దీంతో ఈ జలసంధిపై ఆధిపత్య పోరు అమెరికా-ఇరాన్ ఘర్షణలో ప్రధాన అంశంగా మారింది.
వివరాలు
రెండు చమురు నౌకలపై దాడి
హర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీకి చెందిన రెండు నౌకలపై దాడి జరిగినట్లు యూఏఈ అధికారిక మీడియా వెల్లడించింది.
ఈ దాడికి ఇరానే కారణమని యూఏఈ ఆరోపించింది. ఈ ఘటనతో గల్ఫ్ ప్రాంతంలో భద్రతాపరమైన ఆందోళనలు మరింత పెరిగాయి.
మరోవైపు హర్ముజ్ మీదుగా నౌకల రాకపోకలు కూడా భారీగా తగ్గిపోయాయి.
వివరాలు
నౌకల రాకపోకలకు భారీగా బ్రేక్
యుద్ధానికి ముందు హర్ముజ్ జలసంధి ద్వారా రోజుకు సుమారు 130 నుంచి 140 నౌకలు ప్రయాణించేవి.
అయితే ప్రస్తుతం ఆ సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఒక దశలో రోజుకు కేవలం ఎనిమిది నౌకలు మాత్రమే ఈ మార్గం గుండా వెళ్లినట్లు సమాచారం.
అమెరికా గతంలో ఇరాన్ నౌకలు, పోర్టులపై అమలు చేసిన దిగ్బంధాన్ని కొంతకాలం సడలించింది. ఆ తర్వాత మళ్లీ దానిని పునరుద్ధరించింది.
ఈ పరిణామం ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా విదేశీ మారకద్రవ్య ఆదాయంపై ఒత్తిడి పెరుగుతోంది.
వివరాలు
ప్రపంచ చమురు మార్కెట్‌లో ఆందోళన
ఇరాన్ సంక్షోభం మరింతకాలం కొనసాగితే ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) అంచనా ప్రకారం.. ఈ ఏడాది ప్రపంచ చమురు సరఫరా రోజుకు 43 లక్షల బ్యారెళ్ల మేర తగ్గే అవకాశం ఉంది.
ఇది మొత్తం సరఫరాలో దాదాపు 4 శాతానికి సమానం. అయితే మరోవైపు చమురుకు డిమాండ్ తగ్గడం, అమెరికా ముడిచమురు నిల్వలు పెరగడం వంటి కారణాలతో ధరలు కొంత తగ్గాయి.
గురువారం అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు 2 శాతానికి పైగా పడిపోయాయి.
వివరాలు
ట్రంప్‌పై అమెరికాలోనూ ఒత్తిడి
ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించాలని అమెరికాలోనూ డిమాండ్లు పెరుగుతున్నాయి.
పెరిగిన ఇంధన ధరలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణపై ప్రభావం చూపుతున్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి.
నవంబర్‌లో జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఈ అంశం ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయంగా కీలకంగా మారింది.
ఇటీవల హర్ముజ్ జలసంధిపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఇరాన్ ఈ వాదనను ఖండించింది.
తమపై విధించిన ఆంక్షలను ఎత్తివేయడంతో పాటు నిలిపివేసిన ఆస్తులను విడుదల చేయాలన్న తమ షరతులు నెరవేరే వరకు హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవబోమని స్పష్టం చేసింది.
వివరాలు
యుద్ధం కంటే ఆర్థిక ఒత్తిడికే ప్రాధాన్యమా?
ఇరాన్‌పై సైనిక చర్యలు చేపట్టే అవకాశం ఉందని ట్రంప్ గతంలో హెచ్చరించారు.
అయితే ప్రస్తుతం అమెరికా ప్రధానంగా ఆర్థిక ఒత్తిడిని పెంచడంపైనే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.
ఇరాన్‌కు ఆయుధాల సరఫరాలో సహకరిస్తున్న వ్యక్తులు, సంస్థలపై అమెరికా ఇప్పటికే ఆంక్షలు విధించింది.
ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని సాధించకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ తెలిపారు.
అదే సమయంలో ఆర్థిక ఆంక్షలు, నౌకా దిగ్బంధం ద్వారా ఇరాన్‌ను చర్చలకు తీసుకురావాలని అమెరికా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
అబ్రహం లింకన్ నౌకపై వదంతులు
హర్ముజ్ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా నౌకాదళానికి చెందిన యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌకపై సిబ్బంది మరణించారన్న వార్తలను అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఖండించింది.
యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియక, తమ జీవితాలు ఇంతేనన్న భావనతో ఏడుగురు నేవీ సిబ్బంది బలవన్మరణానికి పాల్పడ్డారంటూ ఇరాన్ మీడియా కథనాలు ప్రచురించింది.
అయితే ఈ వార్తల్లో నిజం లేదని అమెరికా స్పష్టం చేసింది. అవి తప్పుడు సమాచారమని CENTCOM పేర్కొంది.
260 రోజులకు పైగా సముద్రంలో ఉన్నప్పటికీ అబ్రహం లింకన్ క్యారియర్ గ్రూప్‌లోని సిబ్బంది ధైర్యంగా విధులు నిర్వర్తిస్తున్నారని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది.
ఆగస్టు 3న సముద్రంలో పడిపోయిన ఓ నావికుడిని కూడా సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించింది.
వివరాలు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తప్పదా?
ఇదే సమయంలో అబ్రహం లింకన్ నౌకను ఒడ్డుకు తీసుకొచ్చి, దాని స్థానంలో జార్జ్ వాషింగ్టన్ నౌకను మోహరించినట్లు అమెరికా ప్రకటించింది. ఇది సాధారణ ప్రక్రియలో భాగమేనని స్పష్టం చేసింది.
హర్ముజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం సాగుతున్న పోరు ఇప్పుడు అమెరికా-ఇరాన్ ఘర్షణలో అత్యంత కీలకమైన అంశంగా మారింది.
ఒకవైపు అమెరికా నిరవధిక నౌకా దిగ్బంధం,కఠినమైన ఆర్థిక ఆంక్షలతో ఇరాన్‌పై ఒత్తిడి పెంచుతోంది.
మరోవైపు ఇరాన్ ఈ వ్యూహాత్మక జలమార్గంపై తన నియంత్రణను కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది.
ఈ ఉద్రిక్తతలు ఎంతకాలం కొనసాగుతాయన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.
హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు,ప్రపంచ చమురు సరఫరా,ఇంధన ధరలు మాత్రమే కాకుండా అంతర్జాతీయ వాణిజ్యం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా ఈ పరిణామాల ప్రభావం పడే అవకాశం ఉంది.