Parents Property Rights: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆస్తులు వెనక్కి..!
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ ప్రభుత్వం ఇటీవల తల్లిదండ్రుల హక్కులను కాపాడేందుకు సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.
తల్లిదండ్రుల నుంచి ఆస్తి రాసిపుచ్చుకుని వారిని పట్టించుకోని వారసులపై చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది.
వారు సరిగా చూడడం లేదని భావించిన తల్లిదండ్రులు జిల్లా ట్రిబ్యూనల్ అధికారిగా ఉండే ఆర్డీవోకు పిటిషన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది.
విచారణలో తల్లిదండ్రుల ఫిర్యాదు నిజమని తేలినప్పుడు ఆ ఆస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను రద్దు చేయాలని సబ్‌రిజిస్టార్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తల్లిదండ్రులను పెంచి పెద్ద చేసిన వారసులు, ఆస్తిపాస్తులు అందుకున్న వెంటనే వారిని నడిరోడ్డుపై వదిలేసి, ఇంట్లో నుంచి గెంటేస్తున్నారు.
వివరాలు
ఆస్తిని తిరిగి తల్లిదండ్రుల పేరుపై బదిలీ
వారసులు కనీసం ఒక ముద్ద అన్నం పెట్టలేకపోవడం వలన తల్లిదండ్రులు జీవన ముగింపు దశను ఎంతో కష్టంగా గడపాల్సి వస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆస్తులు రాసిచ్చిన తల్లిదండ్రులను వారసులు పట్టించుకోని పక్షంలో ఆ ఆస్తులను తిరిగి వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిబంధనలు తీసుకువచ్చింది.
2007 సీనియర్ సిటిజన్స్ చట్టం ప్రకారం, తల్లిదండ్రులు తమ వారసులు సరిగా చూడడం లేదని ఫిర్యాదు చేయవచ్చు.
విచారణలో ఫిర్యాదు నిజమని తేలితే ఆర్డీవో ఆదేశాల ఆధారంగా సబ్‌రిజిస్టార్లు ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి, ఆస్తిని తిరిగి తల్లిదండ్రుల పేరుపై బదిలీ చేస్తారు.
ఈ నిర్ణయంపై రాష్ట్రంలోని వృద్ధులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో కుటుంబాల్లో మార్పు
తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం తమ జీవితాలను త్యాగం చేస్తారు. వారసులు తమ బాధ్యతగా భావించకుండా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరం.
కొంతమంది వారిని ఇంటి నుంచి గెంటేస్తుండగా, మరికొందరు వృద్ధాశ్రమాలకు పంపుతున్నారు. ఈ తరహా పరిస్థితులను నియంత్రించడంలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం కీలక పాత్ర పోషిస్తుంది.
తల్లిదండ్రుల హక్కులను కాపాడటంలో ఈ చర్య సమర్థవంతంగా పనిచేయడం ద్వారా ఆ కుటుంబాల్లో మార్పు తీసుకురావాలి.