LOADING...
Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. ఇంటికి చేరుకున్న సీఐడీ, బెంగాల్‌లో రాజకీయ కలకలం
మమతా బెనర్జీకి మరో షాక్.. ఇంటికి చేరుకున్న సీఐడీ, బెంగాల్‌లో రాజకీయ కలకలం

Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. ఇంటికి చేరుకున్న సీఐడీ, బెంగాల్‌లో రాజకీయ కలకలం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2026
05:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాజకీయంగా మరో సవాలు ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికలఫలితాలు,పార్టీ అంతర్గత విభేదాలు,ఎమ్మెల్యేలు-ఎంపీల అసంతృప్తి మధ్య తాజాగా సంతకాల ఫోర్జరీ ఆరోపణల కేసు కొత్త చర్చకు దారి తీసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా రాష్ట్ర సీఐడీ అధికారులు మంగళవారం కోల్‌కతాలోని హరీశ్ ఛటర్జీ స్ట్రీట్‌లో ఉన్న మమతా బెనర్జీ నివాసానికి చేరుకున్నారు. మమతా నివాస చిరునామాతోనే తృణమూల్ కాంగ్రెస్ అధికారిక పార్టీ కార్యాలయం కూడా నమోదై ఉండటంతో,విచారణలో భాగంగా ఆ ప్రాంగణాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని సీఐడీ అధికారులు వెల్లడించారు. అయితే సీఐడీ బృందం అక్కడికి చేరుకున్న వెంటనే మాజీ ఎంపీ సుభాశిష్ చక్రవర్తి సహా పలువురు టీఎంసీ నేతలు అధికారులను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

వివరాలు 

ఇరువర్గాల మధ్య కొంతసేపు వాగ్వాదం

ఇరువర్గాల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా మమతా బెనర్జీతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కూడా ప్రస్తుతం ఇంట్లో లేరని, అందువల్ల తనిఖీలకు అనుమతి ఇవ్వలేమని టీఎంసీ నేతలు తెలిపారు. ఒకటి లేదా రెండు రోజుల తర్వాత రావాలని సీఐడీ అధికారులను కోరారు. అయితే, చట్టబద్ధమైన దర్యాప్తును అడ్డుకోవడం సరైన చర్య కాదని అధికారులు స్పష్టం చేశారు. అనంతరం జరిగిన చర్చల తర్వాత సీఐడీ బృందం ప్రాంగణంలోకి ప్రవేశించి తనిఖీలు చేపట్టింది.

వివారాలు 

ఫోర్జరీ వివాదం ఎలా మొదలైంది?

గత మే 20న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్‌కు తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఒక లేఖ సమర్పించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా సోవన్ దేబ్ ఛటోపాధ్యాయను ఎంపిక చేసినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఆ లేఖపై తమ సంతకాలు నకిలీగా రూపొందించారని టీఎంసీ ఎమ్మెల్యేలు రితబ్రతా బెనర్జీ, సందీపన్ సాహా ఆరోపించారు. ఈ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారగా, అనంతరం ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ వ్యవహారంపై కోల్‌కతాలోని హేర్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అనంతరం బెంగాల్ ప్రభుత్వం దర్యాప్తు బాధ్యతలను సీఐడీకి అప్పగించింది.

Advertisement

వివరాలు 

సమన్లకు హాజరుకాని అభిషేక్ బెనర్జీ

వివాదాస్పద లేఖపై పార్టీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ సంతకం ఉండటంతో, విచారణకు హాజరుకావాలంటూ సీఐడీ పలుమార్లు సమన్లు జారీ చేసింది. అయితే అనారోగ్య కారణాలను చూపిన అభిషేక్ బెనర్జీ, వ్యక్తిగతంగా హాజరుకాలేనని తెలియజేస్తూ 15 రోజుల గడువు కోరినట్లు సమాచారం. ఈ పరిణామాల మధ్య సీఐడీ అధికారులు నేరుగా మమతా బెనర్జీ నివాసానికి చేరుకోవడం బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ కేసు దర్యాప్తు మరిన్ని కీలక మలుపులు తిరిగే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement