Loading...
Rahul Gandhi: రాహుల్ గాంధీ బృందానికి సీజేఐ అపాయింట్‌మెంట్ నిరాకరణ..
రాహుల్ గాంధీ బృందానికి సీజేఐ అపాయింట్‌మెంట్ నిరాకరణ..

Rahul Gandhi: రాహుల్ గాంధీ బృందానికి సీజేఐ అపాయింట్‌మెంట్ నిరాకరణ..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 12, 2026
07:56 am

ఈ వార్తాకథనం ఏంటి

ఓట్ల చోరీ ఆరోపణలపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను బలంగా వినిపిస్తూ సోమవారం సుప్రీంకోర్టు వరకు భారీ ర్యాలీ నిర్వహించనుంది. 'ఓట్ల చోరీ' అంశాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ క్రమంలో పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని సీజేఐని కోరారు. ఈ అంశంపై విజ్ఞాపన పత్రం సమర్పించేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, వారి అభ్యర్థనను జస్టిస్ సూర్యకాంత్ తిరస్కరించినట్లు సమాచారం.

వివరాలు 

సీజేఐ కార్యాలయానికి ఈమెయిల్

ఈ మేరకు ఆదివారం రాత్రి రాహుల్ గాంధీకి సీజేఐ కార్యాలయం ఈమెయిల్ పంపినట్లు తెలిసింది.

రాహుల్ బృందం సీజేఐకి వివరించాలనుకున్న అంశం ఇప్పటికే సుప్రీంకోర్టు విచారణలో ఉన్నందున ప్రతిపక్ష నేతలను ప్రత్యేకంగా కలిసి వినతిపత్రం స్వీకరించడం సముచితం కాదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

సంబంధిత అంశంపై న్యాయస్థానంలో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, సీజేఐ పరిపాలనాపరంగా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేరని ఆయన కార్యాలయం ఈమెయిల్‌లో స్పష్టం చేసినట్లు తెలిసింది.

వివరాలు 

దాఖలైన పిటిషన్లపై మంగళవారం విచారణ

''సంబంధిత అంశం ఇప్పటికే సుప్రీంకోర్టు ముందున్న విచారణలో ఉంది. ఆ పిటిషన్లను విచారిస్తున్న ధర్మాసనానికి సీజేఐ నేతృత్వం వహిస్తున్నారు. ప్రతిపక్ష సభ్యులు వచ్చి ఆయనను కలిసినా ఈ అంశంపై పరిపాలనాపరంగా ఎలాంటి ఆదేశాలూ జారీ చేయడం సాధ్యం కాదు. ఎస్‌ఐఆర్‌ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) అంశంపై రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తమ వాదనలు వినిపించాలనుకుంటే పిటిషన్లు దాఖలు చేయవచ్చు. ఇప్పటికే దాఖలైన పిటిషన్లపై మంగళవారం విచారణ జరగనుంది. సోమవారం కొత్త పిటిషన్లు దాఖలు చేసినా, వాటిని మిగిలిన పిటిషన్లతో కలిపి మంగళవారం ధర్మాసనం విచారిస్తుంది. ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం నాయకులు స్వేచ్ఛగా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు'' అని సీజేఐ కార్యాలయం రాహుల్‌కు పంపిన ఈమెయిల్‌లో పేర్కొన్నట్లు సమాచారం.

ADVERTISEMENT

వివరాలు 

భయం వీడి.. ప్రజాస్వామ్యం కోసం కదలిరండి: రాహుల్

'చలో దిల్లీ-ప్రజాస్వామ్యం కోసం ర్యాలీ' పేరుతో కాంగ్రెస్ చేపట్టనున్న మార్చ్‌లో అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు, సామాన్య ప్రజలు పాల్గొనాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్యాన్ని కోరుకునేవారంతా భయాన్ని వీడి తమతో కలిసి ముందుకు రావాలని కోరుతూ ఆదివారం వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

రాజకీయ పార్టీలు,కులం,మతం,ప్రాంతం వంటి భేదాలు పక్కనపెట్టి ప్రజాస్వామ్యం కోసం నిలబడాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో భాగస్వాములు కావాలని అన్నారు. '

'సోమవారం సుప్రీంకోర్టు వరకు ర్యాలీ నిర్వహిస్తున్నాం.రాజకీయ పార్టీలు, కులం, మతం, ప్రాంతం అనే తేడాలు లేకుండా ప్రజాస్వామ్యాన్ని కోరుకునేవారు, దాని పరిరక్షణ కోసం నిలబడాలనుకునే ప్రతి ఒక్కరూ మాతో కలిసి రండి. ఎవరూ భయపడొద్దు'' అని రాహుల్ గాంధీ తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.

ADVERTISEMENT