CJI Surya Kant: రాహుల్ గాంధీకి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నిరాకరణ.. కారణమేంటంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని ప్రతిపక్ష నాయకుల బృందంతో సమావేశమయ్యేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నిరాకరించారు. అయితే, సామాన్య పౌరుల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరికీ సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. ఎవరైనా తమ సమస్యలపై పిటిషన్లు దాఖలు చేసి న్యాయం కోరవచ్చని, వాటిని చట్టప్రకారం విచారిస్తామని తెలిపారు.
వివరాలు
అపాయింట్‌మెంట్ కోరిన రాహుల్ గాంధీ, ఖర్గే
'ఓట్ల చోరీ' ఆరోపణలు, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా,ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ,తిరిగి బ్యాలెట్ పత్రాల విధానాన్ని ప్రవేశపెట్టడం వంటి అంశాలపై వినతిపత్రం సమర్పించేందుకు రాహుల్ గాంధీ,రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే సీజేఐని కలవాలని భావించారు.
ఈ మేరకు సోమవారం అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కోరుతూ ఆయనకు లేఖ రాశారు.
ఆదివారం తనకు లేఖ అందిందని, అదే రోజు రాత్రి దానికి సమాధానం ఇచ్చానని జస్టిస్ సూర్యకాంత్ సోమవారం మీడియాకు వెల్లడించారు.
అయితే, ప్రతిపక్ష నేతలతో సమావేశం కావడం సాధ్యం కాదని, అందుకు గల కారణాలను కూడా లేఖలో వివరించినట్లు తెలిపారు.
ఈ లేఖలోని వివరాలను మాత్రం వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.
వివరాలు
ప్రతి పౌరుడికీ న్యాయం కోరే హక్కు
ఆ సమాచారం గోప్యంగా ఉంచుతున్నట్లు పేర్కొంటూ, పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే లేఖ రాసిన వారినే సంప్రదించాలని సూచించారు.
ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ న్యాయస్థానం వైఖరిని స్పష్టం చేశారు. భారతదేశంలోని ప్రతి పౌరుడికీ న్యాయం కోరే హక్కు ఉందని తెలిపారు.
ఎవరైనా తమ సమస్యలపై పిటిషన్ దాఖలు చేయవచ్చని, వాటిని న్యాయస్థానం తప్పకుండా విచారిస్తుందని పేర్కొన్నారు.
వివరాలు
న్యాయస్థానం పరిధిలోని అంశాలపై పరిపాలనపరంగా జోక్యం తగదు
ప్రతిపక్ష నేతలు ప్రస్తావించిన అంశాలపై ఇప్పటికే సుప్రీంకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలై విచారణలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ కారణంగానే సీజేఐ వారితో సమావేశమయ్యేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.
న్యాయస్థానం పరిధిలో ఉండి, విచారణ కొనసాగుతున్న అంశాలపై పరిపాలనపరంగా జోక్యం చేసుకోవడం సరైన పద్ధతి కాదనే సూత్రం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సంబంధిత పిటిషన్లు ఇప్పటికే విచారణ జాబితాలో ఉన్న నేపథ్యంలో, ప్రతిపక్ష నాయకులతో నేరుగా సమావేశమై వినతిపత్రాన్ని స్వీకరించడం న్యాయ ప్రక్రియపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే సీజేఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.