CJP-D: సీజేపీలో విభేదాలు.. కొత్త వేదిక ప్రకటించిన మాజీ వలంటీర్ మనీష్ బ్రహ్మభట్
ఈ వార్తాకథనం ఏంటి
జెన్‌జీ ఉద్యమాలతో దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీలో తాజాగా విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ మాజీ వలంటీర్ మనీష్ బ్రహ్మభట్ సీజేపీ నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. అసలు ఉద్యమ స్ఫూర్తి నుంచి పార్టీ పక్కదారి పట్టిందని విమర్శించారు. నిరసనల్లో చురుగ్గా పాల్గొన్న వలంటీర్లను పక్కనపెట్టి.. కొంతమందితోనే పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు.. సీజేపీ నాయకత్వం రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో 'కాక్రోచ్ జనతా పార్టీ-డెమోక్రటిక్' (CJP-D) పేరుతో కొత్త వేదికను ప్రకటించారు.
వివరాలు
సీజేపీని 'టీమ్ కేజ్రీవాల్'గా మార్చేశారు
గురువారం ఢిల్లీలో మనీష్ బ్రహ్మభట్ CJP-Dను ప్రకటించారు. ఇకపై కాక్రోచ్ జనతా పార్టీతో ఎలాంటి సంబంధం లేకుండా సీజేపీ-డెమోక్రటిక్ వేదిక ద్వారా తన పోరాటాన్ని కొనసాగిస్తానని తెలిపారు.
అభిజీత్ దీప్కే నేతృత్వంలోని సీజేపీ నాయకత్వం ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు అనుకూలంగా మారిందని ఆయన ఆరోపించారు.
సీజేపీని 'టీమ్ కేజ్రీవాల్'గా మార్చేశారని విమర్శించారు.
విద్యార్థులు, నిరుద్యోగులు, ఇతర రాష్ట్రాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాల్సింది పోయి.. బీజేపీని వ్యతిరేకించడమే పార్టీ ప్రధాన లక్ష్యంగా మారిందని అన్నారు.
దీప్కేతో పాటు సీజేపీలోని మరో ఏడుగురు నాయకులకు ఆప్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని బ్రహ్మభట్ ఆరోపించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మీడియాతో మాట్లాడుతున్న మనీష్ బ్రహ్మభట్
Manish Brahmbhatt launches new group Cockroach Janata Party Democratic in Delhi
— Ankit (@Extreo_) September 3, 2026
Manish Brahmbhatt launches a new group called Cockroach Janata Party Democratic in Delhi.
He says the old Anna anti-corruption protest was hijacked by Arvind Kejriwal's team without asking real…
వివరాలు
సీజేపీ ఉద్యమంలో గుజరాత్ నుంచి వలంటీర్‌గా, కోఆర్డినేటర్‌గా..
మనీష్ బ్రహ్మభట్ ప్రస్తుతం గుజరాత్‌లో మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు.
2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలన్‌పూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 964 ఓట్లు సాధించారు.
సీజేపీ ఉద్యమంలో గుజరాత్ నుంచి వలంటీర్‌గా, కోఆర్డినేటర్‌గా కూడా పనిచేశారు.
అయితే నీట్ నిరసనల తర్వాత ఆగస్టు మొదటి వారంలో సీజేపీ కోర్ టీమ్ సమావేశం నిర్వహించింది.
ఈ సమావేశానికి మనీష్‌కు ఆహ్వానం అందలేదు. మహారాష్ట్రలోని అభిజీత్ దీప్కే నివాసంలో ఈ సమావేశం జరుగుతున్నట్లు మీడియా ద్వారా తెలుసుకున్న బ్రహ్మభట్ అక్కడికి వెళ్లారు.
అయితే ఆయనకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది.
వివరాలు
నిరసన సమయంలో ఆరోగ్యం క్షీణించడంతో..
దీప్కే నివాసంలోకి తనను అనుమతించకపోవడంతో మనీష్ అక్కడే బైఠాయించి నిరసనకు దిగారు.
జంతర్‌మంతర్ ఉద్యమంలో పాల్గొన్న పలువురు వలంటీర్లను కీలక చర్చలకు ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉంచారని ఆయన ఆరోపించారు.
ఈ నిరసన సమయంలో ఆరోగ్యం క్షీణించడంతో బ్రహ్మభట్, ఆయన సహచరుడు రాహుల్ పాండ్యా ఆసుపత్రిలో చేరారు.
అనంతరం సీజేపీ నుంచి వైదొలుగుతున్నట్లు మనీష్ ప్రకటించారు. తాజాగా CJP-D పేరుతో కొత్త వింగ్‌ను ప్రారంభించారు.
వివరాలు
తొలుత వ్యంగ్యాత్మక ఆన్‌లైన్ ఉద్యమంగా CJP
భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన 'కాక్రోచ్' వ్యాఖ్యల నేపథ్యంలో మే 16న అభిజీత్ దీప్కే CJPని తొలుత వ్యంగ్యాత్మక ఆన్‌లైన్ ఉద్యమంగా ప్రారంభించారు.
అయితే క్రమంగా అది యువతకు ఒక వేదికగా మారింది. నిరుద్యోగం, పరీక్ష పేపర్ లీకులు, విద్యా వ్యవస్థలో అక్రమాలు వంటి సమస్యలను ఈ వేదిక ప్రధానంగా ప్రస్తావించింది.
అయితే సీజేపీ ప్రారంభమైనప్పటి నుంచే అభిజీత్ దీప్కేకు ఆప్‌తో సంబంధాలు ఉన్నాయనే చర్చ సాగింది.
జంతర్‌మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో కేజ్రీవాల్‌తో పాటు ఆప్‌కు చెందిన పలువురు నాయకులు పాల్గొని ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు.
వివరాలు
ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా,ఎన్నికల ప్రచార బృందాల్లో పని చేసిన అభిజీత్ దీప్కే
అభిజీత్ దీప్కే 2020 నుంచి 2023 వరకు ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా, ఎన్నికల ప్రచార బృందాల్లో పనిచేశారు.
ముఖ్యంగా 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీమ్స్, డిజిటల్ కంటెంట్ ద్వారా ఆప్ ప్రచారంలో భాగస్వామిగా ఉన్నారు.
2023లో ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన తర్వాత ఆప్‌తో తన అనుబంధం ముగిసిందని దీప్కే గతంలోనే స్పష్టం చేశారు.
అయితే తాజాగా మనీష్ బ్రహ్మభట్ చేసిన ఆరోపణలపై సీజేపీ నాయకత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.