కర్నాటక: హుబ్లీ రైల్వే స్టేషన్‌కు గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో చోటు
కర్నాటకలోని హుబ్లీ రైల్వే స్టేషన్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. హుబ్లీ రైల్వే స్టేషన్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్‌ను కలిగి ఉంది. 1,507 మీటర్ల పొడవైన ప్లాట్‌ఫారమ్‌ను ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించారు. సుమారు 20 కోట్ల రూపాయలతో నిర్మించబడిన ఈ ప్లాట్‌ఫారమ్ హుబ్లీ యార్డు పునర్నిర్మాణంలో భాగంగా దీన్ని నిర్మించారు. భవిష్యత్‌లో హుబ్లీ-ధార్వాడ్ ప్రాంతంలో మరిన్ని రైళ్ల రాకపోకలు పెరగనున్ననేపథ్యంలో అవసరాన్ని పరిష్కరించే లక్ష్యంతో ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించారు. హుబ్లీ రైల్వే స్టేషన్‌ను అధికారికంగా శ్రీ సిద్ధారూఢ స్వామిజీ స్టేషన్ అని పిలుస్తారు.
రెండు రైళ్లను ఒకేసారి రెండు దిశల నుంచి పంపొచ్చు
రెండు రైళ్లను ఒకేసారి రెండు దిశల నుంచి పంపడం ఈ ప్లాట్‌ఫారమ్ ప్రత్యేకత. ప్లాట్‌ఫారమ్ పొడవును జనవరి 12న ధృవీకరించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తెలిపింది. ఈ ప్రాంతంలో కనెక్టివిటీని పెంచడం కోసం హోసపేట-హుబ్లీ-తినైఘాట్ సెక్షన్ విద్యుద్ధీకరణ, హోసపేట స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేయడం వంటి పనులను ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించారు. ఆధునిక సౌకర్యాలు, అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తూ హోసపేట స్టేషన్‌ను నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. హంపి స్మారక చిహ్నాలను తలపించేలా దీన్ని రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు.