కర్ణాటకకు కలిసొచ్చిన అసెంబ్లీ ఎన్నికలు; మూడు నెలల్లో రాష్ట్రానికి ఆరోసారి ప్రధాని మోదీ రాక
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ తీవ్రంగా కృష్టి చేస్తోంది. స్వయంగా ప్రధాని మోదీ రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. దక్షిణాదిన బీజేపీకి కీలకమైన కర్ణాటకలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని మోదీ భావిస్తున్నారు. అందుకే గత మూడు నెలల్లో ఇప్పటికే ఐదు సార్లు రాష్ట్రంలో పర్యటించగా, ఆదివారం మరోసారి కర్ణాటకకు రానున్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడల్లా రూ.వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థానలు చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఆదివారం పర్యటనలో భాగంగా ప్రతిష్టాత్మక 10 లైన్ల బెంగళూరు-మైసూరు హైవే ప్రారంభించనున్నారు. మాండ్యా, హుబ్బళ్లి-ధార్వాడ్‌లలో రూ.16,000 కోట్ల విలువైన కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభిస్తారు.
ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభిచనున్న మోదీ
బెంగళూరు-మైసూరు హైవే అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణ సమయాన్ని సుమారు మూడు గంటల నుంచి 75 నిమిషాలకు తగ్గిస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే రావడం వల్ల ఈ ప్రాంతంలో సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఇది ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని బీజేపీ భావిస్తోంది. ఈ హైవేను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. అలాగే హుబ్బలి-ధార్వాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని పీఎంఓ తెలిపింది. మైసూరు-ఖుషాల్‌నగర్ నాలుగు లైన్ల రహదారికి కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని వెల్లడించింది. శ్రీ సిద్ధారూఢ స్వామీజీ హుబ్బళ్లి స్టేషన్‌లో ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభిస్తారు. రూ.20 కోట్లతో 1,507 మీటర్ల పొడవున ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించారు. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ను కూడా సొంతం చేసుకుంది.