అసెంబ్లీ ఎన్నికలు: కర్ణాకటపై ప్రధాని మోదీ స్పెషల్ ఫోకస్; శివమొగ్గ విమానాశ్రయం ప్రారంభం
మరో రెండు నెలల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఆ రాష్ట్రంపై ప్రధాని మోదీ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఏమాత్రం అవకాశం వచ్చినా ఆయన కర్ణాటకలో పర్యటిస్తున్నారు. 2023లో ఇప్పటి వరకు రెండు నెలల్లోనే ఏకంగా ఐదు సార్లు మోదీ కర్ణాటకలో పర్యటించడం గమనార్హం. సోమవారం కూడా రాష్ట్రంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అనంతరం విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ స్వయంగా వెళ్లి పరిశీలించారు. విమానాశ్రయం ప్రారంభోత్సవంలో మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప కూడా పాల్గొన్నారు. సోమవారం యడియూరప్ప 80వ పుట్టినరోజు కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
శివమొగ్గ విమానాశ్రయం చాలా అద్భుతంగా ఉంది: ప్రధాని మోదీ
శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. విమానాశ్రయం చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. ఈ విమానాశ్రయంలో కర్ణాటక సంప్రదాయం, సాంకేతికత కలయికను చూడవచ్చని వివరించారు. దాదాపు రూ.450 కోట్లతో కొత్త ఎయిర్ పోర్టును నిర్మించారు. దీని ప్యాసింజర్ టెర్మినల్ భవనం లోటస్ ఆకారంలో ఉంటుంది. కర్నాటక పర్యటనలో భాగంగా షికారిపుర-రాణేబెన్నూరు కొత్త రైల్వే లైన్, కోటేగంగూరు రైల్వే కోచింగ్ డిపోలకు రెండు రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. శివమొగ్గ-శికారిపుర-రాణేబెన్నూరు కొత్త రైల్వే లైన్ రూ. 990 కోట్లతో నిర్మించనున్నారు. ప్రధాని మోదీ కర్ణాటకకు ఇంత ప్రాధాన్యత ఇస్తారని ఊహించలేదని ఈ సందర్భంగా యడియూరప్ప చెప్పడం గమనార్హం. కర్ణాటకలో సాధారణ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్-మేలో జరగనున్నాయి.