బీజేపీ యాక్షన్ ప్లాన్ షూరూ- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
బీజేపీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్ కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను, కో-ఇన్‌ఛార్జ్‌గా బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కె.అన్నామలైని అధిష్టానం నియమించింది. 2023లో తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా అందులో కర్ణాటక ఒకటి. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీకి ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. మే నెలలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా, రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కర్ణాటకపై కేంద్రం ప్రత్యేక ప్రేమను కనబర్చింది. ఆ రాష్ట్రానికి భారీగా నిధులను కేటాయించింది.
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని విజయతీరాలకు చేర్చిన ప్రధాన్
అంతకుముందు ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా ప్రధాన్ ఉన్నారు. రాష్ట్రంతో పాటు పార్టీలోని అంతర్గత వివాదాలను పరిష్కరించి ఆ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించారు. దీంతో అధిష్టానం నంచి ప్రశంసలు పొందారు. కర్ణాటకలో కూడా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు బీజేపీ ఇబ్బంది మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఆ వివాదాలను పరిష్కరించి, రాష్ట్రంలో తిరిగి బీజేపీ అధికారంలో తెస్తారనే విశ్వాసంతోనే ప్రధాన్ ఇన్‌చార్జ్‌గా నియమించినట్లు తెలుస్తోంది. విద్యాసంస్థల్లో హిజాబ్, హలాల్ ఉత్పత్తులను నిషేధించాలనే డిమాండ్‌లు, ప్రార్థనా స్థలాల్లో లౌడ్‌స్పీకర్ల వాడకంపై ఆంక్షల వంటి నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. లింగాయత్ వర్గాలనికి చెందిన బీఎస్ యడియూరప్పను ముఖ్యమంత్రిగా తొలగించడం బీజేపీలో ఎన్నికల్లో ప్రతికూలంగా మారే అవకాశమూ లేకపోలేదు.