కర్ణాటక: అసెంబ్లీ ఎన్నికల వేళ.. రథయాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ
మరికొన్ని నెలల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ మళ్లీ రాష్ట్రంలో పాగా వేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తోంది. బడ్జెట్ సెషన్ అయ్యాక.. ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలో 'రథయాత్ర' చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేసే ఈ రథయాత్రకు రూట్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారు. 'రథయాత్ర'కు సంబంధించిన తుది నిర్ణయాలు ఇంకా జరగలేదని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఇప్పటికే ప్రకటించారు. బీజేపీ జాతీయ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నిర్ణయాలు జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కర్ణాటకలో 'రథయాత్ర'పై కూడా నిర్ణయం జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
హిందుత్వ అజెండా, మోదీ ఛరిష్మాతో ఎన్నికలకు వెళ్తున్న బీజేపీ
కర్ణాటకలో జాతీయ యువజనోత్సవాలను ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాగా.. ఆ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప గైర్హాజరయ్యారు. వాస్తవానికి ఆయనను సీఎంగా తొలగించినప్పటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన్ను బుజ్జగించేందుకు ప్రధాని మోదీ పిలుపించుకొని మాట్లాడారు. ఓబీసీ కోటా కింద పంచమసాలీ ఉపవర్గాలకు రిజర్వేషన్లు కల్పించడంపై ప్రభుత్వంపై విజయపుర బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈయనపై పార్టీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అలా చేస్తే.. పార్టీకి పంచమసాలీ సామాజిక వర్గం దూరం అవుతందనే హెచ్చరికలు వస్తున్నాయి. ఎన్నిఅవాంతరాలు ఎదురైనా హిందుత్వ అజెండా, మోదీ ఛరిష్మాతో ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాలో బీజేపీ ఉంది.