Budget 2023: కర్ణాటకకు కలిసొచ్చిన అసెంబ్లీ ఎన్నికలు, బడ్టెట్‌లో భారీగా కేటాయింపులు
2023-2024 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. దేశం 'ఆజాదీ కా అమృత మహోత్సవం' జరుపుకుంటున్న వేళ, ఈ బడ్డెట్‌ను వందేళ్ల స్వతంత్య్ర భారతానికి బ్లూప్రింట్‌గా సీతారామన్ అభివర్ణించారు. ఆర్థిక సంక్షోభం వేళ ప్రజా కర్షక, జనరంజక పథకాల జోలికి వెళ్లని కేంద్రం, కర్ణాటకపై మాత్రం ప్రత్యేక ప్రేమను కనబర్చింది. ఆ రాష్ట్రానికి భారీగా నిధులను కేటాయించింది. ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండటం ఒక కారమైతే, ఈ ఏడాది కన్నడనాట అసెంబ్లీ ఎన్నికలు జరగడం మరో కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కరువు ప్రాంతాలకు సాయం, అప్సర భద్ర ప్రాజెక్టుకు నిధులు
కర్ణాటకలో వెనుకబడిన, కరువు ప్రాంతాలకు ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నట్లు ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో చెప్పారు. అలాగే అప్సర్ భద్ర ప్రాజెక్టు కోసం రూ. 5,300 కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించారు. కరువు ప్రాంతాలకు నీరు అందించేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించడంపై ఆ రాష్ట్ర సీఎం బొమ్మై హర్షం వ్యక్తం చేశారు. రెండు నెలల్లోనే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో మళ్లీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు వ్యూహంలోనే భాగంగానే బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్రం ఈ నిధులను కేటాయించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కర్ణాటకలోని ప్రతిపక్షాలు కూడా కేంద్రంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇన్నాళ్లు ఎన్నికలు లేవని నిధులు కేటాయించలేదని విమర్శస్తున్నాయి. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే ఈ కేటాయింపులు చేసినట్లు చెబుతున్నారు.